Begin typing your search above and press return to search.

క‌ర్ణ‌న్‌ కు మ‌రోసారి షాకిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   15 May 2017 9:45 AM GMT
క‌ర్ణ‌న్‌ కు మ‌రోసారి షాకిచ్చిన సుప్రీం
X
మొండిగా పిడి వాద‌న‌ను వినిపించ‌ట‌మే కాదు.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన క‌ల‌క‌త్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సీఎస్ క‌ర్ణ‌న్‌ కు సుప్రీంకోర్టు మ‌రోసారి షాకిచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆయ‌న‌కు జైలు శిక్ష విధించిన న్యాయ‌స్థానం.. అనంత‌రం ఆయ‌న అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంత‌రం.. ఆయ‌న క‌నిపించ‌కుండా పోవ‌టం.. ఆయ‌న కోసం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా.. గ‌తానికి భిన్నంగా జ‌స్టిస్ క‌ర్ణ‌న్ త‌న తీరును మార్చుకున్న‌ట్లుగా త‌న సందేశాన్ని సుప్రీంకు చేర‌వేశారు. తాను సుప్రీంకోర్టుకు భేష‌ర‌తు క్ష‌మాప‌ణ చెప్పేందుకు సిద్ధ‌మ‌ని.. త‌న‌పై జారీ చేసిన అరెస్టు ఆదేశాల్ని వెన‌క్కి తీసుకోవాలంటూ ఆయ‌న అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని కోరారు. దీనికి.. సుప్రీం నుంచి సానుకూల స్పంద‌న ల‌భించ‌లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా అరెస్ట్ ఆదేశాల్ని వెన‌క్కి తీసుకోవాలంటూ ఆయ‌న విన్న‌వించ‌టంతో పాటు.. త‌న న్యాయ‌వాది ద్వారా పిటీష‌న్ వేశారు. కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం.. ఆయ‌న పిటీష‌న్ సుప్రీం ముందుకు విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు స్పందిస్తామ‌ని.. అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండాలని చెప్పింది.

తాజాగా ఆయ‌న కోరిన‌ట్లుగా అరెస్ట్ ఆదేశాల్ని వెన‌క్కి తీసుకునే విష‌యంలో.. కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేసే విషయంలో సుప్రీం సానుకూలంగా స్పందించ‌లేదు. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ విన‌తిని తిరస్క‌రించట‌మే కాదు.. విలువైన కోర్టు స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారంటూ చీవాట్లు పెట్ట‌టం గ‌మ‌నార్హం.

త‌న న్యాయ‌వాది చేత సుప్రీం కోర్టులో ఎప్ప‌టిక‌ప్పుడు పిటీష‌న్లు వేయిస్తున్న జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌.. మ‌రోవైపు తాను ఎక్క‌డ ఉన్నాన‌న్న విష‌యాన్ని మాత్రం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం విశేషం. సుప్రీంకోర్టు అరెస్ట్ ఆదేశాలు జారీ చేయ‌టానికి కొద్ది గంట‌ల ముందు కలకత్తా న‌గ‌రాన్ని విడిచి పెట్టి వెళ్లిన ఆయ‌న‌.. అప్ప‌టి నుంచి ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌యం మీద స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. ఆయ‌న త‌మిళ‌నాడుకు వెళ్లార‌ని చెబుతున్నా.. ఆయ‌న అక్క‌డ‌కు వెళ్ల‌లేద‌ని.. ఏపీలో ఉన్న‌ట్లుగా కొంద‌రు చెబుతున్నారు. ఏమైనా జ‌స్టిస్ క‌ర్ణ‌న్ కోసం త‌మిళ‌నాడు.. ప‌శ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి.. ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవాల‌న్న పోలీసుల ప్ర‌య‌త్నం ఏమ‌వుతుందన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.