Begin typing your search above and press return to search.

ఎల్జీ పాలిమర్స్ కి సుప్రీం షాక్

By:  Tupaki Desk   |   15 Jun 2020 10:30 AM GMT
ఎల్జీ పాలిమర్స్ కి సుప్రీం షాక్
X
విశాఖపట్నం నగరం ఎల్జీ పాలిమర్స్ ఘటనతో ఎంత వణికిపోయిందో చూశాం. ప్రశాంతతకు నిలయమైన నగరంలో అలాంటి విషాద ఘటనను వారు తట్టుకోలేకపోయారు. అయితే, మొదట్నుంచి ఈ విషయంలో ఎల్జీ పాలిమర్స్ వాదన సరిగా లేదు. వారు ప్రజల గురించి ఒక్క ప్రకటన చేయలేదు. కనీసం క్షమాపణ కూడా కోరలేదు. ఇందులో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అయితే, తాజాగా అనేక విషయాలపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా... ఏ విషయంలోను సుప్రీంకోర్టు ఎల్జీ పాలిమర్స్ కి అవకాశం ఇవ్వలేదు.

ముఖ్యంగా ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వేసిన ఈ పిటిషను విచారణకు స్వీకరించినా కూడా... పర్యావరణానికి హాని కలిగించే విషయాల్లో స్పందించడానికి ఎన్జీటీకి అన్ని అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్యాస్ లీక్ ఘటనను ఎన్జీటీ సుమోటుగా స్వీకరించడంలో ఎటవంటి తప్పులేదని పేర్కొంది.

అయితే, ఎల్జీ పాలిమర్స్ మూడు పిటిషన్ల పై వచ్చే వారంలోపు విచారణ పూర్తిచేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దుచేయాలని కోరగా... కుదరదు అంటూ ఖరాఖండిగా సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోనివ్వండి అని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి చెప్పింది.

సీజ్ చేసిన ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్ల పాస్ పోర్టుల విషయంలో కూడా హైకోర్టే తీర్పే ఫైనల్ అని సుప్రీం కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టులో ప్రతి విషయంలోను మొదట్నుంచి ఎల్జీ పాలిమర్స్ కు షాక్ తగులుతోంది. దేశంలోనే ఖరీదైన లాయరును పెట్టుకున్నా ఎల్జీకి విముక్తి కరవైంది.