Begin typing your search above and press return to search.

ముంద‌స్తుపై సుప్రీం షోకాజ్ !!

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:43 AM GMT
ముంద‌స్తుపై సుప్రీం షోకాజ్ !!
X
ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌ సిద్ధ‌మ‌వుతున్నవేళ గులాబీ ద‌ళ‌ప‌తి - ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాకిచ్చింది. ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ ను శుక్ర‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించింది. వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వంతోపాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. రాష్ట్రంలో ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని త‌న పిటిష‌న్‌ లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు సరిదిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు. హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018 - జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ఇప్ప‌టికే ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే ప్రమాదముందని శశాంక్ రెడ్డి త‌న పిటిష‌న్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించారు. ముంద‌స్తు కాకుండా.. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే వ‌చ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంద‌ని సూచించారు. ముందస్తు ఎన్నిక‌ల‌తో వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంతోపాటు కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘానికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. వారం రోజుల్లోగా స్పంద‌న దాఖ‌లు చేయాల‌ని ఇరు వర్గాలను ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘం ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మ‌రి!