Begin typing your search above and press return to search.

వార్తల్లోకి వచ్చిన గజేంద్ర శర్మ ఎవరు? ఆయనకు బాసటగా ఎందుకు నిలవాలి?

By:  Tupaki Desk   |   14 Jun 2020 2:30 AM GMT
వార్తల్లోకి వచ్చిన గజేంద్ర శర్మ ఎవరు? ఆయనకు బాసటగా ఎందుకు నిలవాలి?
X
గజేంద్ర శర్మ. ఈ పేరులో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇంతకు ముందెప్పుడు వార్తల్లో వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే.. ఆయనేమీ దేశ ప్రజలందరికి తెలియాల్సిన వ్యక్తేం కాదు.కానీ.. తాజాగా ఆయన చేస్తున్న పోరు నేపథ్యంలో ఆయన గురించి.. ఆయన పోరాటం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం కలిగించేది కావటం గమనార్హం.

అగ్రాకు చెందిన ఆయన.. తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలపై మొదట మూడు నెలలు.. ఇటీవల మరో మూడు నెలల పాటు మారిటోరియం అవకాశాన్ని ఇస్తూ ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసింది. మారిటోరియం కబురు మంచిగానే ఉన్నా.. అందులోని నిబంధనలు సామాన్య.. మధ్యతరగతి వారికి చుక్కలు చూపించేలా ఉన్నాయి. మారిటోరియంకు ఓకే చెబితే.. మరింత భారం మన రుణానికి తోడుకానుంది. ఈ నిబంధనపై పోరాడుతున్నారు గజేంద్రశర్మ.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటివేళ బ్యాంకుల వాయిదాల్నిచెల్లించటం కష్టంగా మారిందన్నారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం.. దానిపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషన్ దారు తరఫు వాదనను వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోనిఆర్టికల్ 21 ఇచ్చిన జీవన హక్కుకు మారిటోరియం నిబంధనలు భంగం వాటిల్లేలా చేస్తున్నాయన్నారు.

మారిటోరియం వేళ.. విధించిన వడ్డీని అసలులో కలపటం ఇబ్బందేనని చెప్పారు. అందుకే ప్రజలకు ఊరట కల్పించేలా మారిటోరియం వేళలో వేసిన వడ్డీని రద్దు చేయాలన్న ఆయన డిమాండ్ పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే మాత్రం కోట్లాది మందికి మేలు జరగటం ఖాయం. ఇదిలా ఉంటే.. గజేంద్ర శర్మ వాదనలకు ప్రతివాదన వినిపించిన ఆర్ బీఐ.. రుణాల మీద వడ్డీని రద్దు చేస్తే బ్యాంకుల మీద దాదాపు రూ.2.1 లక్షల కోట్ల భారం పడుతుందన్న వాదనలు వినిపించారు. అదే జరిగితే బ్యాంకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని.. ఆర్థిక సామర్థ్యం దెబ్బ తింటుందని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరెలా రియాక్టు అవుతుందో చూడాలి.