Begin typing your search above and press return to search.

రాజీవ్ హత్యకేసులో దోషికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   10 March 2022 3:41 AM GMT
రాజీవ్ హత్యకేసులో దోషికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
X
ఏజీ పెరారివాలన్.. అన్న పేరును ప్రస్తావించినంతనే ఇప్పటి తరానికి చెందిన వారు గుర్తించకపోవచ్చు. కానీ.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. రాజకీయ పరిణామ క్రమాన్ని నిశితంగా పరిశీలించే వారికి పెరారివాలన్ కొత్తేం కాదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అత్యంత భారీ ఆత్మాహుతి దాడిని చేపట్టిన వారిలో ఇతగాడు అత్యంత కీలకం.

దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మట్టు బెట్టేందుకు జరిగిన భారీ ఆత్మాహుతి ప్రోగ్రాంలో పాల్గొనటం.. అతడ్ని సుప్రీంకోర్టు దోషిగా నిర్దారించటం.. యావజ్జీవ కారాగారశిక్షలో భాగంగా ఏకంగా 32 ఏళ్ల పాటు జైల్లో ఉన్న అతడికి తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఏడుగురిని న్యాయస్థానం గుర్తించి.. వారందరికి జీవిత ఖైదును విధించారు. దీంతో అప్పటినుంచి జైల్లో ఉంటూ నేటికి ఆరుగురు శిక్ష అనుభవిస్తున్నారు. పెరారివాలన్ బెయిల్ పిటిషన్ పై జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు.. జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను చేపట్టింది. ముప్ఫై ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడని.. పెరోల్ వేళ అతడి ప్రవర్తన సంతృప్తికరంగా ఉండటంతో అతడ్ని విడుదల చేయాలని అతడి తరఫు న్యాయవాదులు వాదించారు.

1991 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్ గాంధీని శ్రీపెరంబూదూర్ లో ఎల్టీటీఈ సానుభూతిపరులు భారీ ఎత్తున ఆత్మాహుతి కార్యక్రమాన్ని చేపట్టిన దారుణ ఉదంతంలో రాజీవ్ బలయ్యారు. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ నేత మీద జరిగిన అతి పెద్ద ఆత్మాహుతి దాడిగా దీన్ని పలువురు అభివర్ణిస్తారు.

ఈ కేసులో నిందితులుగా 1999 మేలో కోర్టు పెరారివాలన్.. మురుగున్.. శాంతన్ మరియు నళినితో సహా ఏడుగురిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ కేసులో 32 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్న పెరారివాలన్ బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో తమిళనాడు గవర్నర్ తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఎందుకంటే పెరారివాలన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన నిర్ణయాన్ని గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయటం.. ఆయన ఆ ఫైల్ ను దాదాపు రెండున్నరేళ్లుగా క్లియర్ చేయకపోవటాన్ని తప్పు పట్టింది.

aబెయిల్ సిఫార్సు అంశంపై రాష్ట్ర గవర్నర్ కు ఏమైనా ప్రత్యేక విచక్షణాధికారం ఉంటుందా? అని తీవ్రంగా ప్రశ్నించింది. రెండున్నరేళ్లు తన దగ్గర ఉంచుకొన్న తర్వాత రాష్ట్రపతికి పంపటానని తప్పు పట్టింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.