Begin typing your search above and press return to search.

చారిత్ర‌కం: సెక్ష‌న్ 377 మీద రివ్యూకు సుప్రీం ఓకే

By:  Tupaki Desk   |   10 July 2018 1:04 PM GMT
చారిత్ర‌కం: సెక్ష‌న్ 377 మీద రివ్యూకు సుప్రీం ఓకే
X
ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆశ‌గా ఎదురుచూస్తున్న ప‌రిణామం తాజాగా చోటు చేసుకుంది. కొత్త అధ్యాయానికి నాంది అన్న‌ట్లు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఐపీసీలోని సెక్ష‌న్ 377 మీద దాఖ‌లైన రివ్యూ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రిస్తూ చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కీ ఈ సెక్ష‌న్ దేనికి సంబంధించింది? సుప్రీం రివ్యూ చేప‌ట్ట‌టం చారిత్ర‌కం ఎందుకైంద‌న్నది చూస్తే..

ఐపీసీ సెక్ష‌న్ 377 అంటే.. ప్ర‌కృతి విరుద్ధంగా జ‌రిగే లైంగిక సంప‌ర్కానికి సంబంధించిన నేరం. అంటే.. మ‌గ‌వారు మ‌గ‌వారిని.. ఆడ‌వాళ్లు ఆడ‌వారిని.. మ‌నుషులు జంతువుల‌తో జ‌రిపే సంప‌ర్కాన్ని అనైతికంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలాంటి త‌ప్పుల్ని చేసిన వారిని సెక్ష‌న్ 377 కింద అస‌హ‌జ‌మైన నేరానికి పాల్ప‌డినందుకు యావ‌జ్జీవ కారాగార జైలుశిక్ష లేదంటే ప‌దేళ్ల జైలును విధించే వీలుంది. జైలుతో పాటు భారీ జ‌రిమానాను విధించే వీలుంది. బ్రిటీష్ హ‌యాంలో ఈ చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. అప్ప‌టి బ్రిటిష్ పాల‌కులు తీసుకొచ్చిన భార‌త శిక్షా స్మృతిలో ఈ సెక్ష‌న్ ను ప్ర‌వేశ పెట్టారు.

1861లో తీసుకొచ్చిన ఈ సెక్ష‌న్ ను విభేదిస్తూ 2001లో నాజ్ ఫౌండేష‌న్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్ ను విచారించిన కోర్టు.. ఇద్ద‌రు వ‌యోధికులు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగే గే సెక్స్ నేరం కాద‌ని తేల్చింది. అంతేకాదు.. రాజ్యాంగంలోని 14 - 15 - 21 అధిక‌ర‌ణ‌ల్ని సెక్ష‌న్ 377 ఉల్లంఘిస్తోంద‌ని కూడా పేర్కొంది. ఈ తీర్పు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

ఈ తీర్పును వ్య‌తిరేకిస్తూ కొంద‌రు సుప్రీంను ఆశ్ర‌యించారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం.. 2013 డిసెంబ‌రు 11న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. సెక్ష‌న్ 377 రాజ్యాంగ విరుద్ధం కాద‌ని .. నేర‌మ‌ని తేల్చింది. అనంత‌రం ఈ తీర్పును రివ్యూ చేయాల‌ని గే హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. అయితే.. వీటి విచార‌ణ‌కు సుప్రీం తిర‌స్క‌రించింది.

అనంత‌రం ప‌లువురు ఇదే అంశంపై పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌టంతో 2016 ఫిబ్ర‌వ‌రి 2న స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాదంటూ చ‌ట్టం చేయాల‌న్న అంశంపై విచార‌ణ అంశాన్ని ప‌రిశీలించాలంటూ ఐదుగురు న్యాయ‌మూర్తులున్న ధ‌ర్మాస‌నానికి సిఫార్సు చేశారు. దాదాపు 26కు పైగా దేశాల్లో స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాద‌ని చ‌ట్టం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు న్యాయ‌నిపుణులు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పిటిష‌న్ పై రివ్యూ చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రిస్తూ సుప్రీం ఓకే చెప్పేసింది. అయితే.. దీనిపై విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ కేంద్రం త‌ర‌ఫున అద‌న‌పు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుఫార్ మెహ‌తా బెంచ్ చేసిన విన‌తిని సున్నితంగా త్రోసిపుచ్చుతూ విచార‌ణ‌కు ఓకే చెప్పేశారు. ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ ప‌రిణామంపై స్వ‌లింగ సంప‌ర్కుల హ‌క్కుల కోసం పోరాడుతున్న వారు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.