Begin typing your search above and press return to search.

ధోనీకి ఎంత ఇవ్వాలో లెక్క చెప్ప‌మ‌న్న సుప్రీం!

By:  Tupaki Desk   |   1 May 2019 5:05 AM GMT
ధోనీకి ఎంత ఇవ్వాలో లెక్క చెప్ప‌మ‌న్న సుప్రీం!
X
తాను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న కంపెనీకి సంబంధించిన‌ ఆర్థిక వివాదంపై టీమిండియా కెప్టెన్ ధోనీకి సుప్రీం నుంచి కాసింత ఊర‌ట ల‌భించింది. ఒక రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌తో ధోనీకి వివాదం చోటు చేసుకుంది. దీనిపై ఆయ‌న సుప్రీంకోర్టును పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వ‌కుండా స‌ద‌రు సంస్థ త‌న‌ను మోసం చేసింద‌ని.. త‌న‌కు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాల‌ని కోరారు.

ఈ వివాదంపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా స‌ద‌రు సంస్థ‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని జారీ చేశారు. ధోనీకి ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత చెల్లించాలో చెప్పాల‌ని కంపెనీని కోరారు. రియ‌ల్ ఎస్టేట్ సంస్థ అమ్ర‌పాలికి ప్ర‌చార‌క‌ర్త‌గా ధోనీ వ్య‌వ‌హ‌రించారు. 2009 నుంచి 2016 మ‌ధ్య ఈ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు.

ఒప్పందంలో భాగంగా ధోనీకి స‌ద‌రు సంస్థ భారీ మొత్తం బాకీగా ఉండిపోయింది. అస‌లు.. వ‌డ్డీ క‌లిపి దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కూ అమ్ర‌పాలి నుంచి త‌న‌కు రావాల్సి ఉంద‌ని ధోనీ పేర్కొన్నారు. అంతేకాదు.. రాంచీలోని అమ్ర‌పాలి స‌ఫారీలో ఒక పెంట్ హౌజ్ తాను బుక్ చేసుకున్నాన‌ని.. దానికి సంబంధించిన యాజ‌మాన్య హ‌క్కులు కూడా స‌ద‌రు కంపెనీ క‌ల్పించ‌లేద‌ని ధోనీ పేర్కొన్నారు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ధోనీకి ఇప్ప‌టివ‌ర‌కూ చెల్లించిన మొత్తాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని 24 గంట‌ల వ్య‌వ‌ధిలో త‌మ ముందు ఉంచాల‌ని స‌ద‌రు సంస్థ‌ను ఆదేశించింది. ధోనీకే కాదు.. స‌ద‌రు సంస్థ డ‌బ్బులు తీసుకొని ఇల్లు ఇవ్వ‌కుండా మోసం చేసిందంటూ 46 వేల మంది కోర్టును ఆశ్ర‌యించ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. కోర్టు ఆదేశాల‌పై అమ్ర‌పాలి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.