Begin typing your search above and press return to search.

నవాజ్ కు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   20 Oct 2016 5:30 PM GMT
నవాజ్ కు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
X
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ టైం ఏ మాత్రం బాగున్నట్లుగా లేదు. ఆయనకు ఒకదాని తర్వాత మరొకటి అన్న చందంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భారత సైన్యం ఇచ్చిన సర్జికల్ షాకుతో దిమ్మ తిరిగిపోయిన ఆయనకు.. పాక్ ఆర్మీ ఆయన సర్కారుపై గుర్రుగా ఉండటం ఆయన కంటినిండా కునుకు తీయని పరిస్థితి. ఇలాంటి వేళ సర్జికల్ అవమానానికి తోడుగా.. పాక్ పై ఉగ్రవాద ముద్ర వేయాలన్న పట్టుదలతో మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఒకపక్క.. బలూచిస్థాన్ ఇష్యూతో తగులుతున్న ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న ఆయనకు.. పాక్ మీడియా నుంచి అనుకోని షాక్ తగిలింది.

తనకు.. సైన్యానికి మధ్య రచ్చ జరుగుతున్న గుట్టును రట్టు చేయటంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. పాక్ లో ప్రముఖ మీడియా సంస్థ అయిన డాన్ మీద ఆంక్షలు విధించటం.. దీనిపై దేశంలోని మీడియా సంస్థలు ఒక్కటై.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆంక్షల్ని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నవాజ్ కుతాజాగా పాకిస్థాన్ సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతుందని.. విదేశాల్లో ఆస్తులు పోగేసుకుంటుందని.. ఆయన ప్రధానమంత్రిగా అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటీషన్ కు స్పందించిన సుప్రీంకోర్టు.. తాజాగా నవాజ్ కు నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్ లీక్స్ ను ఆధారంగా చేసుకొని ఈ ఆరోపణలు చేశారు. నవాజ్ మీద ఆరోపణలు చేసిన వారిలో నాటి ప్రముఖ క్రికెటర్.. పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలు.. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ప్రధాని నవాజ్ తో పాటు.. ఆయన కుమార్తె.. కుమారులు.. అల్లుడు.. ఆర్థికమంత్రితో పాటు.. పలువురు ముఖ్యఅధికారుల మీద కూడా రావటంతో వారందరికి టోకుగా నోటీసులు జారీ అయ్యాయి. పాక్ అత్యున్నత న్యాయస్థానం దేశ ప్రధానికే నోటీసులు ఇవ్వటం ఇప్పుడా దేశంలో ఆసక్తికర చర్చగా మారింది.
...

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/