Begin typing your search above and press return to search.

టీ స్పీక‌ర్ కు ఇర‌కాటం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   18 Aug 2016 9:00 AM GMT
టీ స్పీక‌ర్ కు ఇర‌కాటం త‌ప్ప‌దా?
X
తెలంగాణ రాష్ట్రంలో ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలు భారీ సంఖ్య‌లో పాల‌క టీఆరెస్ లో చేరడం.. దానిపై ఎన్నిమార్లు ఫిర్యాదులు అందినా స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి స్పందించ‌క‌పోవ‌డంతో విప‌క్షాలు చాలాకాలంగా ఆయ‌న వైఖ‌రిపై మండిప‌డుతున్నాయి. ప‌లువురు నేత‌లు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు మ‌ధుసూద‌నాచారిని ఇర‌కాటంలోకి నెట్టాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఫిరాయింపులపై స్పందించిన సుప్రీం... టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసుదనాచారికి నోటీసులు జారీ చేసింది. స‌మాధానం ఇచ్చేందుకు 3 వారాల గ‌డువు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో స్పీక‌ర్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ పార్టీ నుంచి గెలిచి.. రాజీనామా చేయ‌కుండానే టీఆర్ ఎస్‌ లో చేరార‌ని - దీనిపై స్పీక‌ర్‌ కు ఫిర్యాదు చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపిస్తూ ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు టీడీపీ ఎమ్మెల్యేలూ టీఆరెస్ లో చేరినా ఆ ప్ర‌క్రియ కొంత స‌జావుగా సాగి స్పీక‌ర్ కు ఇబ్బంది రాలేదు. టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉమ్మ‌డిగా పార్టీ మారుతున్నామ‌ని, త‌మ ఎమ్మెల్యేల్లో మూడువంతుల మంది ఆమోదంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్పీక‌ర్‌ కు లేఖ స‌మ‌ర్పించారు. వెంట‌నే ఈ లేఖ‌కు ఆమోదం తెల‌ప‌డంతో వారి విలీన ప్ర‌క్రియ స‌మాప్త‌మైంది. నిబంధ‌న‌లు దీన్ని స‌పోర్టు చేస్తుండ‌డంతో ఈ విష‌యంలో టీడీపీ నాయ‌కులెవ‌రూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించే అవ‌కాశం లేకుండా పోయింది. కానీ, కాంగ్రెస్ మాత్రం త‌మ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకు వెళ్లింది. బుధ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రావ‌డం - నోటీసులు జారీ చేయ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి మింగుడుప‌డ‌టం లేదు. మూడువారాల్లో స్పీక‌ర్ ఎలా స్పందిస్తారు? మ‌రింత స‌మ‌యం కోర‌తారా? లేక వేటు వేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే... ఇటీవ‌ల పుష్క‌రాల పుణ్య స్నానం కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలంపూర్ వెళ్ల‌గా అక్క‌డ ఈ కేసు వేసిన ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ కేసీఆర్ ప‌క్క‌నే ఉండి పుష్క‌ర స్నానం చేశారు. ఈ నేప‌థ్యంలో సంప‌త్ కుమార్ ప‌ట్టు స‌డ‌లించేలా కేసీఆర్ ఏమైనా చ‌క్రం తిప్పుతారా అన్న అనుమానాలు కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. సంప‌త్ కుమార్ త‌న కేసు విష‌యంలో గ‌ట్టిగా నిల‌బ‌డితే మాత్రం స్పీక‌ర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.