Begin typing your search above and press return to search.

వాట్సాప్ కు నోటీసులు ఇచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   27 Aug 2018 11:19 AM GMT
వాట్సాప్ కు నోటీసులు ఇచ్చిన సుప్రీం
X
ప్ర‌ముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు దేశ అత్యున్న న్యాయ‌స్థానం సుప్రీంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. భార‌త్ లో గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియ‌మించ‌లేదో వెల్ల‌డించాల‌ని కోరుతూ స‌ద‌రు సంస్థ‌ల‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివ‌ర‌ణ‌తోకూడిన స‌మాధానాన్ని చెప్పాలంటూ కేంద్ర ఐటీ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ల‌కూ సుప్రీం నోటీసులు జారీ చేయ‌టం గ‌మ‌నార్హం.

తాను జారీ చేసిన నోటీసుల‌పై వారం రోజుల్లో స్పందించాల‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. వాట్సాప్ లో మేసేజ్ లు ఎక్క‌డ నుంచి జ‌న‌రేట్ అవుతున్నాయన్న విష‌యాన్ని వెల్ల‌డించే ట్రాక్ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ లో నెల‌కొల్పాల‌ని వాట్సాప్ ను భార‌త్ కోరుతోంది.

అయితే.. ఈ విష‌యంపై వాట్సాప్ నుంచి సానుకూల‌త ల‌భించ‌లేదు. భార‌త్ లో ఈ త‌ర‌హా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తే.. వినియోగ‌దారుల గోప్య‌త‌ను కాపాడ‌టం క‌ష్ట‌మ‌వుతుంద‌ని చెబుతూ వాట్సాప్ భార‌త స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌ను రిజెక్ట్ చేసింది. అదే స‌మ‌యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా ఉండేలా.. వాటి విష‌యంలో ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేసే విష‌యంపై తాము దృష్టి పెట్టిన‌ట్లుగా పేర్కొంది.

వైర‌ల్ అయ్యే అంశాలు.. ఫేక్ న్యూస్.. మూక హ‌త్య‌ల‌కు సంబంధించిన నేరాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు వీలుగా ఆ త‌ర‌హా మేసేజ్ మూలాల్ని ప‌సిగ‌ట్టేందుకు టెక్నాల‌జీ ప‌రిష్కారాన్ని ఏర్పాటు చేయాల‌ని వాట్సాప్ పై భార‌త్ ఒత్తిడి తెస్తోంది. అయితే.. భార‌త్ లో ఈ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌టం సాధ్యం కాద‌ని వాట్సాప్ చెబుతోంది. ఈ స‌మ‌యంలోనే. గ్రీవెన్స్ అధికారిని భార‌త్ లో ఎందుకు నియ‌మించ‌లేదో వాట్సాప్ కు సుప్రీం నోటీసులు జారీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.