Begin typing your search above and press return to search.

ఆయనకు పన్నీర్.. ఈమెకు కన్నీర్

By:  Tupaki Desk   |   14 Feb 2017 6:57 AM GMT
ఆయనకు పన్నీర్.. ఈమెకు కన్నీర్
X
జయలలిత అక్రమాస్తుల కేసులో తన పోటీదారు శశికళతో పాటు ఇళ‌వ‌ర‌సి - సుధాక‌ర‌న్‌ ల‌ను దోషులుగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో పన్నీర్ సెల్వంపై నిజంగానే పన్నీటి వర్షం కురిసినట్లయింది. ఆయన ఇంటివద్ద మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక శ‌శిక‌ళ వైపు ఉన్న వారంతా త‌న వైపు వ‌స్తార‌ని ప‌న్నీర్ సెల్వం భావిస్తున్నారు. అప్పుడే ఆయ‌న వారితో మంత‌నాలు జ‌రిపే విష‌య‌మై త‌న మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. శ‌శిక‌ళ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న నేప‌థ్యంలో ఈ తీర్పు ప్ర‌భావం ఆమెపై ప‌డింది. అంతేకాదు, ఆమెకు ఇక రాజ‌కీయ భ‌వితవ్యం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరోవైపు పోయెస్‌ గార్డెన్‌ లోని వేద నిల‌యం వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కు సంద‌డి చేసిన శ‌శిక‌ళ మ‌ద్ద‌తుదారులు తీర్పు వెల‌వ‌డ‌గానే అక్క‌డి నుంచి ఒక్క‌సారిగా వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంత‌మంతా ఇప్పుడు నిర్మానుష్యంగా మారి బోసిపోయి క‌న‌ప‌డుతోంది. శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు శిక్ష విధించ‌డంతో ఆమెకు మ‌ద్ద‌తు తెలిపిన‌ అన్నాడీఎంకే వ‌ర్గాల్లో క‌ల‌క‌లం చెల‌రేగుతోంది.

తీర్పు నేపథ్యంలో టీవీని అంటిపెట్టుకుని చూసిన శశికళ - తీర్పు తరువాత ఖిన్నురాలైనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ సుప్రీంకోర్టు వదిలేస్తుందని, ఆపై సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశలు పెట్టుకుని, క్యాంపు రాజకీయాలు నడుపుతూ వచ్చిన ఆమె, తీర్పును విన్న తరువాత కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఆమె చుట్టూ ఉన్న అన్నాడీఎంకే ముఖ్య నేతలు, ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా, ఆమె కన్నీరు ఆగలేదని తెలుస్తోంది.

మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ మరికాసేపట్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బలం కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. శశికళ చెరసాలకు వెళ్లనున్న నేపథ్యంలో చెన్నైలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/