Begin typing your search above and press return to search.

కంచె ఐల‌య్య పుస్త‌కంపై సుప్రీం అనూహ్య తీర్పు

By:  Tupaki Desk   |   13 Oct 2017 9:32 AM GMT
కంచె ఐల‌య్య పుస్త‌కంపై సుప్రీం అనూహ్య తీర్పు
X
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కంచె ఐల‌య్య పుస్త‌కంపై అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా తీర్పును ఇచ్చింది. సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌ట్లు అంటూ రాసిన పుస్త‌కంపై పెను దుమారం రేగ‌టం తెలిసిందే. ఈ పుస్త‌కంలో ఐల‌య్య ప్ర‌స్తావించిన అంశంపై ఆర్య‌వైశ్యులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ పుస్త‌కంపై గ‌డిచిన కొన్ని వారాలుగా నిర‌స‌న‌లు సాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆర్య‌వైశ్యులు.. కంచె ఐల‌య్య‌లు ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. త‌మ కులాన్ని అవ‌మానించేలా కంచె ఐల‌య్య పుస్త‌కం ఉంద‌ని.. దాన్ని త‌క్ష‌ణ‌మే నిషేధించాలంటూ ఆర్య‌వైశ్య సంఘం నేత‌.. ప్ర‌ముఖ న్యాయ‌వాది రామాంజ‌నేయులు గ‌త నెల‌లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీన్ని విచారించిన సుప్రీం ఈ రోజు విచార‌ణ చేప‌ట్టింది.

పిటిష‌న్‌ ను విచారించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. తీర్పును ఇస్తూ.. పుస్త‌కాన్ని తాము నిషేధించ‌లేమ‌ని.. అలా చేస్తే భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్లు అవుతుంద‌న్నారు.

అదే స‌మ‌యంలో ర‌చ‌యిత‌లు స్వీయ‌ నియంత్ర‌ణ పాటించాలే త‌ప్పించి.. వివాదాస్ప‌ద‌మైన కార‌ణంగా పుస్త‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆదేశించ‌లేమ‌న్నారు. దీంతో.. ఐల‌య్య పుస్త‌కాన్ని నిషేధించాల‌న్న డిమాండ్‌ ను సుప్రీం సైతం నో చెప్పిన‌ట్లైంద‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. సుప్రీం తాజా తీర్పును కంచె ఐల‌య్య స్వాగ‌తించారు. త‌మ‌పై ఒక పుస్త‌కం వ‌చ్చినందుకు కోమ‌ట్లు గర్వించాల‌ని.. పుస్త‌కాలు నిషేధిస్తే భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించినట్లు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. కోమ‌ట్లు అన్న మాట‌నే త‌మ‌ను త‌క్కువ చేసిన‌ట్లుగా పిల‌వ‌టానికి వాడుతుంటార‌ని భావించే ఆర్య‌వైశ్యుల్ని.. ఐల‌య్య అదే ప‌నిగా వారిని అలా పిల‌వ‌టం గ‌మ‌నార్హం.