Begin typing your search above and press return to search.

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

By:  Tupaki Desk   |   7 Nov 2022 6:57 AM GMT
అగ్రవర్ణాలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
X
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై గత కొంతకాలంగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అభ్యంతరాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

ఈ విషయంపై దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై సోమవారం నవంబర్‌ 7న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ ఇవ్వడంలో ఎలాంటి వివక్ష లేదని కోర్టు తేల్చిచెప్పింది. అలాగే ఇది రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించగా ఇందులో నలుగురు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థించడం విశేషం. జస్టిస్‌ రవీంద్రభట్‌ మాత్రం మిగతా నలుగురి తీర్పుతో విభేదించారు.

కాగా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 40 వరకు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లంటిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భారీ విజయం లభించినటై్టంది.

తొలుత జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్‌ సవరణ సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించదన్నారు. రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలను ఈ రిజర్వేషన్‌ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం త్రివేది మాట్లాడుతూ.. జనరల్‌ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్‌ కోటా చెల్లుబాటు అవుతుందని, రాజ్యాంగబద్ధమని తెలిపారు.

అలాగే న్యాయమూర్తి జస్టిస్‌ పార్దివాలా రాజ్యాంగం యొక్క 103వ సవరణ చట్టం 2019ను సమర్థించారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌ కూడా ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనంలో ఒకరిగా ఉన్నారు. ఆయన కూడా రిజర్వేషన్‌ను సమర్థించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.