Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ ..సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   16 March 2020 10:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ ..సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం !
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 144 దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయం తో గజగజా వణికిపోతున్నారు. అలాగే ఇప్పటివరకు ఆరువేల మంది వరకు మృత్యువాత పడ్డారు. చైనా సహా ఇటలీ లాంటి దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ‘వర్చువల్ కోర్టులను’ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం నుండి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను వాదించవచ్చునని, కోర్టులు అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే ప్రదేశాలుగా ఉండరాదన్నదే మా ఉద్ధేశ్యం అని అయన తెలిపారు. కరోనా వైరస్ దేశంలో ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నా నేపథ్యంలో ఇప్పటికే కోర్టు రూముల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే లాయర్లు, వ్యాజ్యకారులు, పాత్రికేయులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు బయట ధర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేయడం తో ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించాయి.

ఇక కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని హైకోర్టులతోనూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తరచూ సమీక్షిస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఇకపై కేసులను డిజిటల్ రూపంలో ఫైల్ చేయడం - వర్చువల్ కోర్టుల ద్వారా విచారణ జరపడం తదితర చర్యలు తీసుకోనున్నట్టు - దానికి న్యాయవాదులు - వ్యాజ్యకారులు - ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కోర్టులకు సహకరించాలని అని కోరారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న ప్రభుత్వం సూచించిన నేపధ్యంలో... ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒకే చోట ఉండడానికి వీలులేకపోవడం తో ప్రస్తుతం అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు గత వారం నిర్ణయం తీసుకుంది.