Begin typing your search above and press return to search.

ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు గ‌ట్టి దెబ్బే త‌గిలిందిగా!

By:  Tupaki Desk   |   28 March 2018 7:30 AM GMT
ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు గ‌ట్టి దెబ్బే త‌గిలిందిగా!
X
మొన్న‌టిదాకా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగి రెండేళ్ల క్రితం టీడీపీ కండువాలు క‌ప్పుకున్న ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు నిజంగానే కాలం క‌లిసి రావ‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా... నెల్లూరు జిల్లాలో తమ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనం వివేకానంద‌రెడ్డి - ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు 2014 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత కూడా వ‌రుస‌గా వారికి ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. రాజ‌కీయ భ‌విష్య‌త్తును వెతుక్కుంటూ ఆనం బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చేసి... టీడీపీలో చేరినా అక్క‌డ కూడా వారికి అంత‌గా ప్రాధాన్యం ద‌క్క‌క‌పోగా... అడుగ‌డుగునా ఛీత్కారాలే ఎదుర‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు టీడీపీ నుంచి ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌ప‌డ‌దామా? అన్న కోణంలో ఆలోచిస్తున్న ఆనం బ్ర‌ద‌ర్స్... ప్ర‌త్యామ్నాయ దారులు లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా... ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఆనం బ్ర‌ద‌ర్స్ ఆధ్వ‌ర్యంలో వి ఆర్ విద్యా సంస్థ‌లు న‌డుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ.1000 కోట్ల మేర ఆస్తులు ఉన్న వి ఆర్ విద్యా సంస్థ‌ల‌ను త‌మ చెప్పు చేత‌ల్లోకి తీసుకున్న ఆనం బ్ర‌ద‌ర్స్‌.. విద్యా సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌ను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా గ‌తంలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఇదే వ్య‌వ‌హారంపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో పూర్వ విద్యార్థులంతా క‌లిసి ఆనం బ్ర‌ద‌ర్స్ చెప్పు చేత‌ల్లో నుంచి వి ఆర్ విద్యా సంస్థ‌ల‌కు విముక్తి కల్పించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ సాగించిన హైకోర్టు... విద్యార్థుల‌కు అనుకూలంగా తీర్పునిస్తూ... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క‌మిటీని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసి దాని స్థానే కొత్త క‌మిటీని నియ‌మించాల‌ని సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

అయితే ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఆనం బ్ర‌ద‌ర్స్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభ‌విస్తూ ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు దిమ్మ తిరిగే తీర్పును వెలువ‌రించింది. పూర్వ విద్యార్థుల వాద‌న‌తో ఏకీభ‌వించిన సుప్రీంకోర్టు ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు వ్య‌తిరేకంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఆనం బ్ర‌ద‌ర్స్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను తోసి పుచ్చుతూ... హైకోర్టు చెప్పిన‌ట్లుగానే ప్ర‌స్తుతం ఉన్న క‌మిటీని ర‌ద్దు చేసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటుగా దాని స్థానంలో త‌క్ష‌ణ‌మే కొత్త క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా... కొత్త కమిటీ నియామకాన్ని జూలైలోపు ముగించాలని ఆదేశించింది. జిల్లా కోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరపాలని తీర్పిచ్చింది. అస‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఈ తీర్పు నిజంగానే షాకింగేన‌న్న వాద‌న వినిపిస్తోంది.