Begin typing your search above and press return to search.

బీహార్ కేసుతో మోడీకి షాకిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   3 Jan 2017 6:26 AM GMT
బీహార్ కేసుతో మోడీకి షాకిచ్చిన సుప్రీం
X
అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. అదే పనిగా ఆర్డినెన్స్ ల రూపంలో కీలకచట్టాలు చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అదే పనిగా ఆర్డినెన్స్ లు జారీచేయటం రాజ్యాంగాన్ని వంచించటమేనని తేల్చి చెప్పింది. చట్టసభల్లో చర్చించటం ద్వారా.. నిర్ణయం తీసుకోవటం ద్వారా చేయాల్సిన చట్టాల్ని ఆర్డినెన్స్ ల రూపంలో జారీ చేయటంఅంటే.. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియల్ని దెబ్బ తీయటంగా అభివర్ణించింది. పదిహేనేళ్ల కిందటి బిహార్ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సులపై వచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రభుత్వానికీ చెంపపెట్టులా మారింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తు రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఒకటితో కూడిన ఒక కీలక తీర్పును వెలువరించింది. బీహార్ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని నియమించిన కేసుకు సంబంధించి ఈ తీర్పును వెలువరించింది. 1989 – 1992 మధ్య ఆర్డినెన్స్ రూపంలో ఉపాధ్యాయుల నియమకానికి సంబంధించి నాలుగుసార్లు జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటీషన్ పై విచారించిన సుప్రీం.. అదే పనిగా ఆర్డినెన్స్ ల రూపంలో చట్టాల్ని చేయటం తప్పని తేల్చింది.

ఈ తీర్పు మోడీ ప్రభుత్వానికి సంబంధించింది కానప్పటికీ ప్రస్తుత పరిస్థితికి అతికినట్లు సరిపోతోంది. పార్లమెంటులోని లోక్ సభలో మోడీ సర్కారుకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలో కీలకమైన చట్టాల్ని చేయలేని పరిస్థితుల్లో మోడీ సర్కారు చిక్కుకుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా చట్టాల్ని ఆర్డినెన్స్ రూపంలోకి మోడీ సర్కారు తీసుకొస్తోంది. దీనిపై గతంలోనూ సుప్రీం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ మరో మార్గం లేని నేపథ్యంలో మోడీ సర్కారు ఆర్డినెన్స్ జారీ మీద ఆధారపడుతోంది. ఆర్డినెన్స్ ను జారీ చేసిన ఆరు నెలల వ్యవధిలో చట్టసభ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల దృష్ట్యా ఆర్డినెన్స్ కాల పరిమితి తీరిన వెంటనే.. మరోసారి ఆర్డినెన్స్ ను విడుదల చేయటం ద్వారా.. తాను చేయాలనుకున్న చట్టాల్ని మోడీ సర్కారు పూర్తి చేస్తోంది. తాజాగా వెలువరించిన ఈ తీర్పు మోడీ సర్కారు ఆర్డినెన్స్ ల జారీ జోరుకు కాసింత బ్రేకులు వేసే వీలుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/