Begin typing your search above and press return to search.

‘దిశ’ ఎన్ కౌంటర్ కేసులో సంచలన ఆదేశాలిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:06 AM GMT
‘దిశ’ ఎన్ కౌంటర్ కేసులో సంచలన ఆదేశాలిచ్చిన సుప్రీం
X
సంచలనంగా మారిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలతో పాటు.. నిర్ణయాన్ని తీసుకుంది. నిందితుల్ని పోలీసులు కాల్చి వేశారన్న దానిపై త్రిసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా సుప్రీం ఉత్తర్వులు ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. హైదరాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ పోలీసులే చేశారా? లేక.. అనుకోకుండా జరిగిందన్న విషయంతో పాటు.. పలు సందేహాల్ని తీర్చేందుకు వీలుగా త్రిసభ్య కమిషన్ ను నియమించారు.

ఇందులో సభ్యులుగా ఉన్న వారు నేర న్యాయ శిక్షా వ్యవస్థపై మంచి పట్టున్న వారు కావటం ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ సోండుర్ బల్డోటా.. సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ లు సభ్యులుగా ఉంటారని తేల్చారు.

ఈ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినా అందుకు కోర్టు నో చెప్పటం గమనార్హం. సుప్రీం నియమించిన కమిషన్ ఆర్నెల్ల లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది. అంతే కాదు.. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నిందితుల శవాల్ని భద్రపరిచే విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని సుప్రీం పేర్కొంది.

అంతేకాదు.. ఈ కమిషన్ కు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ న్యాయ సలహాదారుగా ఉంటారని.. కమిషన్ కు అవసరమైన వసతుల్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ కమిషన్ సభ్యులకు సీఆర్ఫీఎఫ్ సిబ్బందితో భద్రతను కల్పించాలని పేర్కొంది.

తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఏ కోర్టు లేదంటే ఇతర సంస్థ కూడా హైదరాబాద్ ఎన్ కౌంటర్ పై విచారణ చేపట్టరాదనిపేర్కొంది. కమిషన్ విచారణకు సంబంధించి మీడియాపై ఆంక్షలు విదించాలని పిటిషనర్ కోరినా సుప్రీంకోర్టు అందుకు సానుకూలంగా స్పందించలేదు. అంతేకాదునిందితుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరగా.. అందుకు కోర్టు నో చెప్పింది. అక్కడేం జరిగిందో తమకు తెలీదని.. ఆ నేరం ఆ నలుగురే చేసి ఉండొచ్చని.. పరస్పర భిన్నమైన వాదనలు వస్తున్న వేళ.. మొదట దర్యాప్తు సాగాలన్నారు. మరి.. సుప్రీం నియమించిన కమిషన్ ఏమని నివేదిక ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.