Begin typing your search above and press return to search.

సింగ్...ఇక నుంచి కింగ్‌

By:  Tupaki Desk   |   5 Jan 2016 6:34 AM GMT
సింగ్...ఇక నుంచి కింగ్‌
X
శాంటా-బంటా - బ‌ల్లే బ‌ల్లే - స‌ర‌దా స‌ర్దార్...వంటి జోకుల‌న్నీ ఇక ఆగిపోనున్నాయి. సిక్కు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న పరిహాసాలపై లోతైన విచారణ చేపట్టడానికి సిద్ధమేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. సిక్కులను ఉద్దేశించి చేసే జోకులతో సిక్కు సముదాయం మొత్తంగానే ఆవేదన చెందుతోందనేది స్పష్టం అవుతోంద‌ని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఢిల్లీలోని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ, ఇతరులు ఈ అంశంపై పిటిషన్లు వేయడం దీనినే తెలియజేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. హర్‌ విందర్‌ చౌదరి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ సహా ఈ విషయమై దాఖలైన పిటిషన్లన్నింటిపై విచారణ చేపడతామని కోర్టు ప్రకటించింది.

సిక్కులను లేదా సర్దార్జీలను కించపర్చే జోకులను అరికట్టాలని హర్‌ విందర్‌ తన పిటిషన్‌ లో కోరారు. దాదాపు 5 వేల వెబ్‌ సైట్లలో ఇలాంటి జోకులు పోస్ట్‌ చేశారని ఆయన తెలిపారు. ఇవి సిక్కు సముదాయానికి ఆవేదన కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా కూడా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆయన తన పిటిషన్‌ లో వివరించారు. వీటిని అదుపు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన కోర్టును కోరారు.ఇది ఒక్క హర్‌ విందర్‌ చౌదరినే కాకుండా మొత్తం సముదాయాన్నే బాధించే అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అవసరమైతే హర్‌ విందర్‌ కు ఒక సీనియర్‌ న్యాయవాదిని కూడా నియమిస్తామని కోర్టు ప్రకటించింది.