Begin typing your search above and press return to search.

ఉమ్మ‌డిలోనిదే పంచుకోవాలంట‌

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:20 AM GMT
ఉమ్మ‌డిలోనిదే పంచుకోవాలంట‌
X
ఒక రాష్ట్రం రెండు ముక్క‌లైతే ఎన్ని పంచాయితీలు అన్న విష‌యం తాజా వ్య‌వ‌హారాల్ని చూస్తే తెలిసిపోతుంది. అదే స‌మ‌యంలో విభ‌జ‌న జ‌రిగినా.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒక స‌ర్దుబాటు.. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు అవ‌గాహ‌న ఉంటే స‌రిపోయేది. కానీ.. ప్ర‌జాసంక్షేమం కంటే కూడా పొలిటిక‌ల్ మైలేజీ మాత్ర‌మే ముఖ్య‌మైన నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మంట పుట్టే ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌రి మీద మ‌రొక‌రు పోటాపోటీగా దెబ్బ తీసుకోవ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ప్ర‌తి విష‌యంలోనూ వివాదాలు ఉన్న‌ట్లే.. కృష్ణా జ‌లాల పంపిణీ వివాదంపై చెల‌రేగిన అంశంపై సుప్రీంను ఆశ్ర‌యించ‌టం తెలిసిందే. బ్రిజేష్ కుమార్ తుది.. మ‌ధ్యంత‌ర తీర్పుల అమ‌లు నిలిపివేయాలంటూ ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్ స‌ర్కారు పిటీష‌న్ దాఖ‌లు చేసింది. బుధ‌వారం ఈ అంశంపై సుప్రీంలో వాద‌న‌లు వాడీవేడిగా సాగాయి.

ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు రెండు అంశాల్ని చాలా స్ప‌ష్టంగా పేర్కొంది. అందులో ఒక‌టి కృష్ణా జ‌లాల‌కు సంబంధించి ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రానికి కేటాయించిన నీటిలోనే రెండు రాష్ట్రాలు పంచుకోవాల‌ని తేల్చింది. అంతేకాదు.. తెలంగాణ పిటీష‌న్‌ పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీంతో పాటు.. కృష్ణా ట్రిబ్యున‌ల్ లో ఖాళీ అయిన స‌భ్యుడి స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని కూడా కేంద్రానికి సూచ‌న చేసింది.

నిజానికి.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న పంచాయితీల విష‌యంలో ప‌రిష్క‌రించుకోవాల‌న్న త‌లంపుతో రెండు రాష్ట్రాలు ప్ర‌య‌త్నిస్తే.. సుప్రీంకోర్టు గ‌డ‌ప వ‌ర‌కూ వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కానీ.. ప్ర‌తి విష‌యంలోనూ ఎవ‌రి ప్ర‌యోజ‌నం వారు చూసుకోవ‌టం.. ప్ర‌తి విష‌యాన్ని పీట‌ముడులు వేసేలా చేయ‌టం స‌మ‌స్య‌గా మారింది. కృష్ణా జలాల విష‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రం వాటా మార‌ద‌ని.. ఉన్న వాటాలో రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల‌ని సుప్రీం పేర్కొన్న నేప‌థ్యంలో.. మ‌రో వివాదానికి తెర లేచిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.