Begin typing your search above and press return to search.
సినిమా హాళ్లల్లో జాతీయ గీతం..పునరాలోచనలో సుప్రీం
By: Tupaki Desk | 23 Oct 2017 5:24 PM GMTతన తీర్పును సమీక్షించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి అని - ఆ సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలన్న గతేడాది తీర్పును పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తంచేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మోరల్ పోలీసింగ్ కు ఫుల్ స్టాప్ పడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తమ భుజాలపై దేశభక్తిని మోయాల్సిన అవసరం లేదని ఈ బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతం పాడనంత మాత్రాన వాళ్లు జాతి వ్యతిరేకులు కారని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది.
ప్రతి థియేటర్‌లో సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతం వేయాలని - ప్రేక్షకులంతా లేచి నిలబడాల్సిందే అని గతేడాది సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేస్తూ ``జాతీయ గీతం సమయంలో అందరూ కచ్చితంగా లేచి నిలబడాలని అనుకున్నపుడు ఎందుకు దాని కోసం ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించడం లేదు?`` అని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గతేడాది నవంబర్‌లో సినిమా హాళ్లలో జాతీయ గీతంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. `ఈ తీర్పును ఉల్లంఘిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తారని ప్రజలు భయపడుతున్నారు. వాళ్లు సినిమా హాళ్లకు వచ్చేది కేవలం వినోదం కోసమే. వాళ్లకు అదే కావాలి. మోరల్ పోలీసింగ్ కాదు` అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అంగ వైకల్యం ఉన్నవారిని ఇందులోంచి మినహాయిస్తూ తమ తీర్పును కాస్త సవరించింది. ఇప్పుడు థియేటర్లలో జాతీయ గీతంపై కొత్తగా ఆర్డర్ ఇవ్వాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.