Begin typing your search above and press return to search.

సుప్రీం అన్ని విషయాల్లో ఇలానే మాట్లాడాలి

By:  Tupaki Desk   |   12 April 2016 4:34 AM GMT
సుప్రీం అన్ని విషయాల్లో ఇలానే మాట్లాడాలి
X
ఆచారాలు.. ధర్మాలు అన్ని మతాల వారికి ఒక్కటే. ఒక మత సంప్రదాయం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే.. మిగిలిన మత ధర్మాలకు సంబంధించిన విషయంలోనూ అదే రీతిలో రియాక్ట్ కావటం ధర్మం. కానీ.. అలాంటివి జరగటం లేదన్న భావన ఈ మధ్య కాలంలో వ్యక్తమవుతోంది. మైనార్టీలకు సంబంధించి తలాక్.. తలాక్.. తలాక్ అంటూ మూడుసార్లు మూడు అక్షరాల పదాన్నిఉచ్చరిస్తే చాలు.. అప్పటివరకూ సాగిన వైవాహిక బంధం ముగిసిపోతుందన్నది ముస్లిం మతధర్మం చెప్పే మాట. ఇదెక్కడి ధర్మం? ఈ యుగంలోనూ అదేం ధర్మమని ప్రశ్నించే వారున్నారు. ఆ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ.. ఈ విషయం మీద సుప్రీం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది.

అదే సమయంలో కొన్ని హిందువు దేవాలయాల్లో మహిళల్ని అనుమతించకూడదన్న సంప్రదాయం విషయంలో సుప్రీం సూటిగా స్పందించటమే కాదు.. వ్యాఖ్యలు కూడా చేయటం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. హిందూ మత సంప్రదాయాల విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తున్న సుప్రీం న్యాయమూర్తులు.. అదే రీతిలో మైనార్టీ మత సంప్రదాయాల విషయంలోనూ అదే ధర్మాన్ని ఎందుకు పాటించటం లేదన్నది ఒక ప్రశ్న. కొన్ని హిందూ దేవాలయాల్లోకి మహిళల్ని ఎందుకు అనుమతించన్న అంశంపై సంప్రదాయం రాజ్యాంగం కంటే మించిందా? అన్న సూటి ప్రశ్న వేసింది.

సుప్రీం వేసిన ప్రశ్న చూసేందుకు ధర్మంగా ఉండొచ్చు. అయితే.. అంతే సూటిదనాన్ని ఇతర మతధర్మాలకు సంబంధించిన వివాదాల్లోనూ సుప్రీం సూటిగా వ్యాఖ్యలు చేయటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శబరిమలై ఆలయంలోకి మహిళల్ని ఎందుకు అనుమతించకూడదన్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. కొన్ని మత ధర్మాల విషయంలో ఆచితూచి అడుగులు వేసే సుప్రీం న్యాయమూర్తులు.. అందుకు భిన్నమైన పద్ధతిని అనుసరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజం ఎంతన్నది మేధావులు.. న్యాయ నిపుణులు తేలిస్తే బాగుంటుంది.