Begin typing your search above and press return to search.

అద్వానీ అండ్ కోల‌కు భారీ ఎదురుదెబ్బ‌!

By:  Tupaki Desk   |   19 April 2017 6:46 AM GMT
అద్వానీ అండ్ కోల‌కు భారీ ఎదురుదెబ్బ‌!
X
అనుమానం నిజ‌మైంది. ఇంత‌కాలం సందేహంగా ఉన్న‌ది వాస్త‌వ‌రూపం దాల్చింది. వివాదాస్ప‌ద క‌ట్ట‌డం (బాబ్రీ మ‌సీదు) కూల్చివేత కేసులో బీజేపీ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రైన ఎల్ కే అద్వానీకి అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ఎదురుదెబ్బ త‌గిలింది. వివాదాస్ప‌ద క‌ట్ట‌డం కూల్చివేత ఉదంతంలో అద్వానీ.. ఉమాభార‌తి.. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి స‌హా మొత్తం 16 మందిని కుట్ర‌దారులుగా సుప్రీంకోర్టు తేల్చింది. పాతికేళ్ల కింద‌టి ఈ కేసు అప్ప‌టి నుంచి కొన‌సా..గుతూనే ఉంది. ఈ కేసులో బీజేపీ సీనియ‌ర్ నేత‌లు అభియోగాలు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

ఈ ఉదంతంపై అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్క‌న పెట్టిన సుప్రీంకోర్టు.. ల‌క్నో ట్ర‌యిల్ కోర్టుకు విచార‌ణ పూర్తి చేయాల‌ని ఆదేశించ‌టం సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ నేత‌ల‌పై కేసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అనుమ‌తినిస్తూ.. జ‌స్టిస్ పీసీ ఘోష్‌.. ఆర్ ఎఫ్ నారిమ‌న్‌ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తుది తీర్పును వెలువ‌రించింది. ఈ కేసు విచార‌ణ‌ను రెండేళ్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌ని ఆదేశించ‌టం గ‌మ‌నార్హం.

శ్రీరాముడి జ‌న్మ‌స్థ‌ల‌మైన అయోధ్య‌లో రామమందిరం నిర్మించాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ మందిరం స్థానే బాబ్రీ మ‌సీదు నిర్మించిన వివాదంలో సుప్రీంకోర్టు.. ఈ నిర్మాణాన్ని వివాదాస్ప‌ద క‌ట్ట‌డంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించింది. అయితే.. వ్య‌వ‌హారికంలో అంద‌రికి సుపరిచితంగా బాబ్రీ మ‌సీదుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ కేసుకు మూలాన్ని చూస్తే.. 1992 డిసెంబ‌రు ఆరున వివాదాస్ప‌ద క‌ట్ట‌డాన్ని క‌ర‌సేవ‌కులు కూల్చి వేశారు. ఆ ఘ‌ట‌న‌పై రెండు కేసులు న‌మోదైయ్యాయి. క‌ర‌సేవ‌కుల‌పై ఒక కేసు.. మ‌సీదు కూల్చివేత‌కు ప్రేరేపించారంటూ నాయ‌కుల‌పై మ‌రో కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసును విచారించిన రాయ‌బ‌రేలి కోర్టు 2010లో బీజేపీ నేత‌ల్ని నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. అనంత‌రం అప్పీలులో అల‌హాబాద్ హైకోర్టు కూడా ఈ తీర్పును స‌మ‌ర్థించింది. ఈ నేప‌థ్యంలో సీబీఐ సుప్రీంను ఆశ్ర‌యించింది. ఈ ఉదంతంపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం తాజాగా దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టి.. విచారించాల‌ని చెప్ప‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని చెప్పాలి. తాజా ప‌రిణామంతో.. బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/