Begin typing your search above and press return to search.

పులుసులో ములక్కాయలా రాజఖోవా

By:  Tupaki Desk   |   13 July 2016 12:21 PM GMT
పులుసులో ములక్కాయలా రాజఖోవా
X
చెప్పినోళ్లు బాగానే ఉన్నారు. విధేయతను చాటుకునేందుకు.. చెప్పింది చెప్పినట్లు చేసినందుకు అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి ఏమిటో.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజఖోవాను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి పులుసులో ములక్కాయ మాదిరి తయారైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ గిరి దక్కటం అంటే.. ప్రతిభ కంటే విధేయతకే పట్టం కట్టే పరిస్థితి. ఘనత వహించిన కాంగ్రెస్ అనుసరించిన విధానాల పుణ్యమా అని.. మిగిలిన పార్టీలు సైతం కాంగ్రెస్ తరహా రాజకీయాల్ని అనుసరించే దుస్థితి.

అందులో భాగమే.. అరుణాచల్ ప్రదేశ్ ఎపిసోడ్ గా చెప్పాలి. ప్రజలు పవర్ చేతికి ఇస్తే.. దాంతో సంతృప్తి చెందక మరింత పవర్ ను చేజిక్కించుకోవాలన్న దుగ్థే తాజా పరిణామాలకు కారణంగా చెప్పాలి. ఈశాన్యంలో కమల వికాసం మీద ఫోకస్ చేసిన మోడీ పరివారం.. కాంగ్రెస్ దుష్ట రాజకీయ వ్యూహాన్ని ఆ పార్టీ మీదనే ప్రయోగించిన విధానానికి తెర తీశారు. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ లో ఉన్న కాంగ్రెస్ సర్కారుకు చెందిన ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి ప్రభుత్వాన్ని కూలదోశారు. ప్రభుత్వం మైనార్టీలో పడిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను విధించి.. బలాన్ని కూడగట్టుకొన్నకమలనాథులు అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ చేతికి వచ్చేలా చేసుకున్న పరిస్థితి.

నిజానికి అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తితో ఉండి.. రాష్ట్రపతి పాలన నిర్ణయంపై పునరాలోచన చేయాలన్న మాట ఆయన నోట వచ్చింది. అయితే.. పవర్ లోకి రావటమే పరమావధిగా పెట్టుకున్న మోడీ పరివారం రాష్ట్రపతి మాటల్ని పట్టించుకోకుండా తమకున్న విశేష అధికారంతో ఆయన సైతం ఓకే అనేలా చేశారు.

ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లటం..ఈ వ్యవహారాన్ని విచారించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇవ్వటం తెలిసిందే.కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని.. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. రాష్ట్రపతి పాలనను విధించాలని ప్రతిపాదించిన గవర్నర్ నిర్ణయాన్ని అందరూ వేలెత్తి చూపించే పరిస్థితి. నిజంగానే గవర్నర్ రాజ్ ఖోవా తప్పు చేశారా? అంటే.. లేదనే చెప్పాలి. గవర్నర్ గిరి ఇచ్చిన మోడీ మాష్టారు చెప్పినట్లు వినకపోతే.. ఆయనకున్న ఉద్యోగాన్ని పీకి పారేసే పరిస్థితి. అందుకే విధేయతతో మోడీ పరివారం మాటను విని.. వారు చెప్పినట్లే తూచా తప్పకుండా చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపించే దుస్థితి.

సుప్రీం తీర్పు నేపథ్యంలో రాజ్ ఖోవా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. విలువలున్న రాజకీయ నేతలు ఎవరైనా కోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. తల దించుకొని రాజీనామా చేసే పరిస్థితి. కానీ.. చర్మం దళసరిగా మారి.. విలువల కంటే కూడా విధేయతే పరమావధిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేస్తారా? అంటే ప్రశ్నార్థకమే. ఏది ఏమైనా విధేయతతో హైకమాండ్ చెప్పింది చెప్పినట్లు చేసిన దానికి రాజ్ ఖోవా పరిస్థితి పులుసులో ములక్కాయలా మారిందని చెప్పక తప్పదు.