Begin typing your search above and press return to search.

ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   26 May 2020 11:10 AM GMT
ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
X
ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ అయ్యి 12మందిని బలితీసుకున్న దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఈనేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏ వాదనలైనా హైకోర్టు , ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీ పరిశ్రమను సుప్రీం కోర్టు ఆదేశించింది.

విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో మే 7 న స్టైరిన్ గ్యాస్ లీకేజీకి కారణమైన విశాఖపట్నం ఎల్జీ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. దీనివల్ల దాదాపు 500 మంది ఆసుపత్రిలో చేరారని తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది..

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎల్జీ పరిశ్రమ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

కంపెనీ తన వాదనలన్నింటినీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మాత్రమే ఉంచాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు ఏకపక్ష ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ప్లాంట్‌లో ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సంస్థ అధికారులు విశాఖపట్నం‌లోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

లీకేజీపై దర్యాప్తు చేయడానికి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసినందున దీని విచారణలో తాము జోక్యం చేసుకోలేమని రోహత్గి వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని సమస్యలను ఎన్జీటి లేదా రాష్ట్ర హైకోర్టు పరిష్కరిస్తుందని తేల్చిచెప్పింది.