Begin typing your search above and press return to search.

సీబీఐ ట్విస్ట్..కేంద్రానికి సుప్రిం షాక్

By:  Tupaki Desk   |   8 Jan 2019 6:23 AM GMT
సీబీఐ ట్విస్ట్..కేంద్రానికి సుప్రిం షాక్
X
కేంద్రానికి సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల దేశంలో సంచలనం రేపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ - స్సెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానా వివాదంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. రాత్రికి రాత్రి అలోక్ వర్మను బలవంతపు సెలవుపై ఎలా పంపుతారని మొట్టికాయలు వేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. భారత రాజ్యంగం ప్రకారం సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని - సీవీసీ - ప్రధాని నేతృత్వంలోని నియామకాల కమిటీకి అధికారులను సెలవుపై పంపే అధికారం లేదని స్పష్టం చేసింది.

కొద్ది రోజుల కిందట సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ - స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఒకరిపైకొకరు అవినీతి ఆరోపణలు చేసుకొని రచ్చకెక్కారు. ఇందులో అలోక్ వర్మను ఇరికించేందుకు రాకేష్ ఆస్థానా దొంగ స్టేట్ మెంట్ లు తయారు చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం మరింత ఎక్కువైంది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోది కలుగజేసుకున్నారు. అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అలోక్ వర్మను - రాకేష్ ఆస్థానాను బలవంతపు సెలువుపై పంపించారు. మన్నెం నాగేశ్వరరావును సీబీఐ ఇన్ చార్జి డైరెక్టర్ గా నియమించారు. ఈ నిర్ణయం చెల్లందంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

బీజేపీ నేతలు రాజకీయ శత్రువులను ఎదుర్కోవడానికి సీబీఐని అస్త్రంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో అలోక్ వర్మ * రాకేష్ ఆస్థానాల మధ్య ఆధిపత్య పోరు - లంచాల వివాదం కలకలం రేపింది.

మరోవైపు మాజీ బీజీపీ నేతలు యశ్వంత్ సిన్హా - అరుణ్ శౌలి రాఫెల్ స్కాంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో అలోక్ వర్మ విచారణ చేపట్టనున్నట్లు తెలిసే కేంద్రం అలోక్ వర్మను తప్పించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సుప్రీం విచారణలోనూ చాలా విషయాలు వెలుగు చూశాయి. భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యుర్థులపై సీబీఐని అస్త్రంగా వాడుకున్న సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. దీంతో సుప్రీం కేంద్రం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది.

కాగా సుప్రీం కోర్టు తీర్పు బీజేపీకి చెంప పెట్టులా మారింది. ఇప్పటికే దేశంలో స్వతంత్ర వ్యవస్థలను నీరుగారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆర్బీఐని భ్రష్టు పట్టించగా.. సీబీఐ మసకబారింది. ఇక రక్షణ కొనుగోళ్లు వివాదాస్పదమయ్యాయి. నోట్ల రద్దు - జీఎస్టీ సహా అన్ని నిర్ణయాలు అభాసుపాలయ్యాయి. ఇప్పుడు సుప్రీం తీర్పు మరింత ఇరకాటంలో బీజేపీని పడేసింది.