Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌ధానిని ఆ దేశ సుప్రీంకోర్టు ఆ మాట అంది!

By:  Tupaki Desk   |   4 May 2019 5:11 AM GMT
మాజీ ప్ర‌ధానిని ఆ దేశ సుప్రీంకోర్టు ఆ మాట అంది!
X
కాలం ఎంత చిత్ర‌మైందో.. తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. అర‌చేతిలో అధికారాన్ని పెట్టుకొని ఎంత‌లా చెల‌రేగిపోయిన వ్య‌క్తికి.. ఇప్పుడెలాంటి ప‌రిస్థితి ఎదురైంద‌న్న‌ది చూస్తే.. అధికారం ఎంత‌మాత్రం శాశ్వితం కాద‌న్న మాట అర్థం కాక మాన‌దు. పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ తాజాగా పాక్ సుప్రీంకోర్టు కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. ఆయ‌న కోరిన శాశ్విత బెయిల్ ను ఇచ్చేందుకు నో చెప్పిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌కు అనారోగ్యంగా ఉన్నందున జైల్లో ఉంటే ఎప్ప‌టికైనా త‌న ప్రాణాల‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కోర్టును కోరినా.. సుప్రీం ధ‌ర్మాస‌నం మాత్రం లైట్ తీసుకుంది. అంతేకాదు.. ఉన్న‌ట్లుండి ప్రాణాల మీద‌కు వ‌చ్చే స‌మ‌స్య ఏమీ లేద‌ని వ్యాఖ్యానించింది. అయితే.. ఈ వ్యాఖ్య‌ల్ని న‌వాజ్ ష‌రీఫ్ హెల్త్ రిపోర్టులు ప‌రిశీలించిన త‌ర్వాతే చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

న‌వాజ్ వైద్యం కోసం ఈ మార్చి 26న ఆరువారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ ను ఆ దేశ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాను యాంక్జైటీ.. ఒత్తిడి లాంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నాన‌ని.. త‌న‌కు ఎప్పుడైనా ఆక‌స్మిక మ‌ర‌ణం సంభ‌వించొచ్చ‌ని.. అందుకు శాశ్విత బెయిల్ కావాల‌ని కోరారు.

త‌న‌కున్న ఆరోగ్య స‌మ‌స్య‌కు చికిత్స చేయించుకునేందుకు యూకేకు వెళ్లేందుకు అనుమ‌తి కోరారు. ష‌రీఫ్ పిటిష‌న్ ను ప‌రిశీలించిన సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అసిఫ్ స‌యిద్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం నో చెప్ప‌ట‌మే కాదు.. ఉన్న‌ట్లుండి ప్రాణాల మీద‌కు వ‌చ్చే స‌మ‌స్య ఏమీ లేదని వ్యాఖ్యానించింది. పాక్ కు మూడుసార్లు ప్ర‌ధానిగా ప‌ని చేసిన న‌వాజ్ ష‌రీఫ్..మూడు అవినీతి కేసుల్లో దోషిగా తేలి ఏడేళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. పాక్ లో తిరుగులేని అధికారాన్ని అనుభ‌వించిన ఆయ‌న‌.. ఇప్పుడా దేశం నుంచి వీలైనంత త‌ర్వ‌గా వెళ్లిపోవాల‌ని త‌పిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌న్న దానికి ఇంత‌కు మించిన ఉదాహ‌ర‌ణ మ‌రొక‌టి ఉండ‌దు క‌దూ!