Begin typing your search above and press return to search.

అమరావతిపై కేసు వేయాలంటే జంకాల్సిందే

By:  Tupaki Desk   |   12 Aug 2016 3:48 PM GMT
అమరావతిపై కేసు వేయాలంటే జంకాల్సిందే
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట కలిగించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతుంటే.. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం సాంత్వన కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం సానుకూలాంశంగా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి కోర్టుల దృష్టికి వెళ్లటం.. న్యాయస్థానాల్ని ఆశ్రయించటం పెరిగిన నేపథ్యంలో.. ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు మొదలు పెట్టినా కోర్టుల నుంచి బ్రేకులు పడే పరిస్థితి.

ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా షురూ చేసిన ఏపీ రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఒక పిటీషన్ సుప్రీంలో దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ పిటీషన్ దాఖలు చేసిన పిటీషనర్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. ‘‘రాజధాని కట్టుకోవాలంటే అడ్డుకుంటారా? రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా?’’ అంటూ పిటీషనర్ లాయర్ ను సూటిగా ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో తాము అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని పిటీషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. అత్యున్నత న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. అమరావతి నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు తేల్చేయటమేకాదు.. ఇలాంటి వాటితో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటారా? అన్న ప్రశ్న సంధిస్తై మండిపడిన వేళ.. రానున్న రోజుల్లో అమరావతి మీద న్యాయస్థానాల్లో పిటీషన్ వేయాలని ఆలోచించే వారు ఎవరైనా తొందరపడరన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిణామం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా సంతోషాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదు.