Begin typing your search above and press return to search.

మగాళ్లను మగాళ్లు.. ఆడోళ్లను ఆడోళ్లు పెళ్లి చేసుకోవటమేంటి?

By:  Tupaki Desk   |   28 Jun 2015 4:20 AM GMT
మగాళ్లను మగాళ్లు.. ఆడోళ్లను ఆడోళ్లు పెళ్లి చేసుకోవటమేంటి?
X
స్త్రీ.. పురుషులు ఇద్దరూ పెళ్లి చేసుకోవటం.. సంతనాన్ని అభివృద్ధి చేయటం సృష్టి ధర్మం. ప్రపంచ వృద్ధికి అదో సక్రమైన దారి. కానీ.. మగాడు.. సాటి మగాడ్ని పెళ్లి చేసుకోవటం.. మహిళ.. మరో మహిళను పెళ్లి చేసుకోవటం? అన్న ఆలోచనే ఇబ్బందికరం. కానీ.. మారుతున్న కాలానికి తగినట్లుగా.. ఈ ఆడ.. మగ అన్న తేడా ఏంటి? ఎవరు ఎవరిని ఇష్టపడితే వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా లేని బతుకు బతుకేనా? అన్న వాదనను ఈ మధ్యకాలంగా బలంగా తీసుకురావటం.. దానికి తగినట్లే కొన్ని దేశాలు ఇలాంటి వివాహాలకు అనుమతి ఇచ్చేయటం జరిగింది.

తాజాగా.. అమెరికా సుప్రీంకోర్టు.. స్వలింగ వివాహాలకు ఓకే చెప్పేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో.. అమెరికాలో అధికారికంగా ఒక మగాడు.. మరో మగాడ్ని పెళ్లి చేసుకునేందుకు అధికారికంగా అవకాశం లభించింది.అయితే.. ఈ నిర్ణయాన్ని భారతసంతతికి చెందిన అమెరికన్‌.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచేందుకు పోరాడుతున్న బాబీ జిందాల్‌ ఈ విషయంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఆడా.. మగ వివాహాలు దైవ నిర్ణయాలుగా అభివర్ణించిన ఆయన.. స్వలింగ సంపర్క విహానాలు అనైతికమని.. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శరాఘాతం లాంటిదని తేల్చారు.

దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలాంటి వివాహాలను ప్రోత్సహించటం తప్పన్న ఆయన.. ఇలాంటి అంశాల్లో పెద్దఎత్తున ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ.. రాష్ట్రాల ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులు తమ అభిప్రాయాల్ని దేశ ప్రజల మీద ఎలా రుద్దుతారని ఆయన నిలదీస్తున్నారు. ఫక్తు సంప్రదాయవాదిగా మాట్లాడేసిన బాబీ జిందాల్‌ వ్యాఖ్యలపై స్వలింగ సంపర్కులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాను అమెరికన్‌ అని చెబుతున్నప్పటికీ.. ఆయన మాటలు సగటు భారతీయుడ్ని తలపిస్తున్నాయంటూ.. స్వలింగ సంపర్కులు మండిపడుతున్నారు. మరి.. ఈ విషయంలో సంప్రదాయ అమెరికన్లు బాబీ జిందాల్‌కు ఎంతవరకు అండగా ఉంటారో చూడాలి.