Begin typing your search above and press return to search.

పసిమొగ్గల్ని చిదివేస్తే.. నపుంసక శిక్ష?

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:01 AM GMT
పసిమొగ్గల్ని చిదివేస్తే.. నపుంసక శిక్ష?
X
గత కొద్దికాలంగా దేశంలో దారుణమైన నేరాలు పెరిగిపోతున్నాయి. పసిమొగ్గల్లాంటి చిన్నారులపై అత్యాచారాలు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఆందోళన చేస్తున్న వారి డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా.. కార్యరూపం దిశగా ఇప్పటివరకూ అడుగులు పడింది లేదు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణ విషయంలో ఎంపీలు నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన చేసింది. రేపిస్టులకు భారీ దండన విధించే విషయంపై చట్టం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిదుల మీదనే ఉందన్న విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది.

చిన్నారులపై అత్యాచారాలు చేసే వారిని నపుంసకులుగా మార్చాలని.. తమ డిమాండ్ ను చట్టంగా మార్చాలంటూ మహిళా న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన అభ్యర్థనపై సుప్రీం స్పందించింది. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి విధించే శిక్షలకు చట్టరూపం కల్పించే బాధ్యత ఎంపీల మీదనేనని సుప్రీం తేల్చిన నేపథ్యంలో.. వారెలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఇలాంటి శిక్ష పలు దేశాల్లో అమలవుతుంది.