Begin typing your search above and press return to search.

క్ష‌మించ‌మ‌ని కోరిన అత్యున్న‌త న్యాయ‌స్థానం

By:  Tupaki Desk   |   4 Dec 2017 4:25 AM GMT
క్ష‌మించ‌మ‌ని కోరిన అత్యున్న‌త న్యాయ‌స్థానం
X
ఒక అరుదైన ఘ‌ట‌న‌. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఒక మ‌హిళ‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఒక కేసు విచార‌ణ ప‌దేళ్ల పాటు ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో త‌మ‌ను క్ష‌మించాల‌ని సుప్రీంకోర్టు ఒక మ‌హిళ‌ను కోరింది. సంచ‌ల‌నం రేపిన ఈ వైనం ఎలా చోటు చేసుకుంది? ఎందుకు చోటు చేసుకుంది? అన్న విష‌యాల్లోకి వెళితే..

ప‌త్రాల్ని ఫోర్జ‌రీ చేసి త‌న దుకాణాన్ని ఆక్ర‌మించుకున్నారంటూ ఉత్త‌రాఖండ్ లోని రూర్కీకి చెందిన శ్యామ్ ల‌త స్థానిక కోర్టులో 2004లో ఫిర్యాదు చేశారు. అదే కోర్టులో ఆమె సోద‌రులు కూడా ఒక పిటిష‌న్ దాఖ‌లు చేస్తూ.. త‌మ‌ను ఖాళీ చేయించొద్ద‌న్న ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ఉదంతంపై ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసుల‌ను కోర్టు కోరింది. అద్దె ర‌శీదుల‌పై ఉన్న సంత‌కాలు ల‌త‌వేనా కావా అన్న విష‌యాన్ని తేల్చేందుకు సంత‌కాల్ని పోల్చి చూసే నిపుణుడి అభిప్రాయం కోర‌టానికి అనుమ‌తి ఇవ్వాల‌ని పోలీసు ద‌ర్యాప్తు అధికారి కోరారు.

పోలీసు అధికారి విన‌తిని కోర్టు అంగీక‌రించింది. ఈ నేప‌థ్యంలో సంత‌కాల నిపుణుడు కోర్టుకు వ‌చ్చారు. సంత‌కాల్ని ఫోటో తీసుకోవ‌టానికి న్యాయ‌మూర్తి అంగీక‌రించ‌లేదు. దీనిపై ల‌త సెష‌న్స్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.

దీంతో సంత‌కాల సేక‌ర‌ణ‌కు ఓకే చెబుతూ కేసు రికార్డును జ్యూడీషియ‌ల్ మెజిస్ట్రేట్‌కు పంపారు. ఇదే స‌మ‌యంలో సెష‌న్స్ కోర్టు నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ల‌త సోద‌రుడు ఉత్త‌రాఖండ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో.. ల‌త కూడా ఇదే కోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ రెండు పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ జ‌రిపింది. మొద‌టి కేసులో ల‌తకు అనుకూలంగా తీర్పునిస్తూ సంత‌కాల నిపుణుడ్ని తీసుకురావాల్సిందిగా ద‌ర్యాప్తు అధికారిని ఆదేశించింది.

ల‌త సోద‌రుడి పిటిష‌న్‌ పై స్పందిస్తూ జ్యూడిషియ‌ల్ కోర్టు నిర్ణ‌యాన్ని తిర‌స్క‌రించింది. మ‌ళ్లీ ద‌ర్యాఫ్తు చేయాల్సిందిగా చెప్పింది. ఇలా సాగిన ఈ కేసు చివ‌ర‌కు 2009లో సుప్రీంకోర్టుకు చేరింది. చివ‌ర‌కు సుప్రీంకోర్టు మొద‌టితీర్పును తాజాగా స‌మ‌ర్థించింది. అయితే.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన కొద్దిరోజుల‌కే ల‌త మ‌ర‌ణించారు. న్యాయం జ‌ర‌గ‌టంలో ఆల‌స్యం జ‌రిగిన దానికి చింతిస్తూ సుప్రీంకోర్టు ల‌త‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతాయ‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు.