Begin typing your search above and press return to search.

హోదా ఎఫెక్ట్‌!..సుప్రీం బోనులో మోదీ స‌ర్కారు!

By:  Tupaki Desk   |   2 April 2018 9:28 AM GMT
హోదా ఎఫెక్ట్‌!..సుప్రీం బోనులో మోదీ స‌ర్కారు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు రాజ‌కీయ పార్టీలు - ప్ర‌జా సంఘాలు మూక్కుమ్మ‌డిగా నిన‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నిర‌స‌న‌లు అన్నీ ఎవరికి వారుగా చేస్తున్నారే త‌ప్పించి... అంతా ఏక‌మై ఉమ్మ‌డి పోరు మాత్రం చేయ‌డం లేదు. ఎక్క‌డ వైరి వ‌ర్గాల‌కు క్రెడిట్ వ‌స్తుందోన‌న్న భ‌యం అధికార టీడీపీలో నెల‌కొన‌గా... మాట మార్చిన అధికార ప‌క్షంతో తాము క‌లిసి వెళ్లేదే లేద‌ని, టీడీపీనే త‌మ బాట‌లోకి రావాలంటూ వైసీపీ వాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు క‌లుస్తాయో - లేదో గానీ... మొత్తంగా హోదా పోరు కార‌ణంగా ఇప్పుడు ఢిల్లీలో వాతావర‌ణం వేడెక్కిపోయింది. మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌స్తుత పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్న త‌రుణంలో వైసీపీ త‌న పోరాటాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. ఈ నాలుగు రోజుల్లో హోదా రాక‌పోతే... త‌మ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేస్తార‌ని ఆ పార్టీ అధినేత‌ - ఏపీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్రక‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల క్రిత‌మే చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌కు ఇప్ప‌టికీ జ‌గ‌న్ కట్టుబ‌డే ఉన్నారన్న వాద‌న వినిపిస్తోంది. ఏప్రిల్ 6లోగా ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న కేంద్రం నుంచి రాక‌పోతే... త‌మ ఎంపీలు రాజీనామాలు చేయ‌డంతో పాటుగా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ల‌కు దిగుతార‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇక నాలుగేళ్ల పాటు హోదా వ‌ద్ద‌ని చెబుతూ వ‌చ్చిన టీడీపీ హ‌ఠాత్తుగా హోదా నినాదాన్ని భుజానికెత్తుకోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో నేడు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఢిల్లీ బ‌య‌లుదేరుతున్నారు. ప‌లు జాతీయ పార్టీల నేత‌ల‌తో భేటీ కానున్న బాబు... ఏపీకి కేంద్రం ఏ రీతిన న‌ష్టం చేసింద‌న్న‌విష‌యాన్ని ఏక‌రువు పెడ‌తార‌ట‌. అయినా పార్ల‌మెంటు స‌మావేశాలు ముగుస్తున్న ప్రస్తుత త‌రుణంలో బాబు మంత్రాగం ఏమేర ఉప‌యోగ‌ప‌డుతుందో తెలియ‌దు గానీ... ఏపీకి చెందిన అధికార‌ - విప‌క్షాల ప్ర‌మేయం లేకుండానే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని న‌రేంద్ర మోదీ స‌ర్కారు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బోనులో నిల‌బ‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తెలుగు నేల‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జిస్తున్న సంద‌ర్భంగా రూపొందించిన విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల అమ‌లును ఏం చేశారంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ పై స్పందించిన సుప్రీంకోర్టు... కేంద్ర ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల్లో ఎన్నింటిని అమ‌లు చేశారు? ఎన్ని హామీల‌ను అమ‌లు చేయ‌లేదు? అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? అన్న స‌మ‌గ్ర వివ‌రాల‌తో నాలుగు వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాసనం కేంద్ర ప్ర‌భుత్వానికి తాఖీదులు జారీ చేసింది.

అయినా ఈ పిటిష‌న్‌ ను ఎవ‌రు వేశార‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి ఈ పిటిష‌న్‌ ను దాఖ‌లు చేశారు. హోదా కోసం పోరు సాగిస్తున్న వైసీపీ - టీడీపీల‌కు ఈ విష‌యం గుర్తుకు రాకున్నా కూడా రాష్ట్రాన్ని విభ‌జించిన పార్టీగా అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నుంచే ఈ పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే విభ‌జ‌న చ‌ట్టం కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి చెందిన అధికార పార్టీగా టీడీపీ - హోదా కోసం ఆది నుంచి పోరాడుతున్న పార్టీగా వైసీపీ... ఈ పిటిష‌న్ కు ఇంప్లీడ్ పిటిష‌న్ వేస్తే కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి పెరిగిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే మ‌రి ఈ రెండు పార్టీలు ఈ దిశ‌గా ఆలోచిస్తాయా? అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి. మొత్తంగా జ‌రుగుతున్న మొత్తం పోరాటాల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... సుప్రీం జారీ చేసిన నోటీసుల‌కు మాత్రం స్పందించ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేస్తే.. అమ‌లు చేశామ‌ని చెప్పాలి. లేదంటే అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలేమిటో కూడా చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం త‌న వైఖ‌రిని సుప్రీంకోర్టుకు తెలియ‌జేయ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి సుప్రీంకు కేంద్రం ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి.