Begin typing your search above and press return to search.

బాబు కొత్త గోల‌!...వీవీప్యాట్లపై సుప్రీం మాట ఇదే!

By:  Tupaki Desk   |   15 March 2019 8:11 AM GMT
బాబు కొత్త గోల‌!...వీవీప్యాట్లపై సుప్రీం మాట ఇదే!
X
ఓట్ల లెక్కింపులో ఇక‌పై వీవీ ప్యాట్ల లెక్కింపు కూడా త‌ప్ప‌ద‌న్న వాద‌న ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. అందివ‌చ్చిన ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞాన్ని వివినియోగించుకోవాల‌న్న ఉద్దేశ్యంతో దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల్ (ఈవీఎం)ల‌తో పోలింగ్ నిర్వ‌హిస్తోంది. పేప‌ర్ బ్యాలెట్ ద్వారా జ‌రుగుతున్న అక్ర‌మాల‌కు చెక్ పెట్టాలంటే... ఈవీఎంలే మార్గ‌మ‌ని మెజారిటీ పార్టీల‌న్ని కూడా డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అభిప్రాయంపై ఏ ఒక్క పార్టీ కూడా పెద్ద‌గా అభ్యంత‌రం తెల‌ప‌ని నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈవీఎంల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈవీఎంలు వ‌చ్చేదాకా సైలెంట్ గానే ఉన్న కొన్ని రాజ‌కీయ పార్టీలు... ఆ త‌ర్వాత గ‌గ్గోలు పెట్ట‌డం మ‌న‌కు తెలిసిందే. గెలిస్తే ఈవీఎంల‌పై మారు మాట్లాడ‌కుండా న‌డుచుకుంటున్న కొన్ని పార్టీలు... ఓడితే మాత్రం గెలిచిన పార్టీలు ఈవీఎంల ట్యాంప‌రింగ్ కు పాల్ప‌డ్డాయ‌ని ఆరోపించ‌డం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స‌హా 22 పార్టీల అధినేత‌లు ఈవీఎంలు ట్యాంప‌రింగ్ కు గుర‌వుతున్నాయ‌ని ఆరోపించాయి. దీనిని అడ్డుకునేందుకు ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైన ఓట్ల‌ను లెక్కించ‌డంతో పాటుగా స‌గాన స‌గం వీవీప్యాట్లను కూడా లెక్కించాల‌ని ఈ పార్టీలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. దీనిపై నేటి ఉద‌యం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు నేరుగా ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసిన రాజ‌కీయ పార్టీలు కోరుతున్న‌ట్లుగా సగం మేర వీవీ ప్యాట్ల లెక్కింపున‌కు సంబంధించి మీరేమంటారంటూ ఆ నోటీసులు జారీ చేసింది. అస‌లు స‌గం మేర వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్య‌మేనా? అంటూ కూడా సుప్రీం ఈసీని అడిగింది. దీనిపై ఈ నెల 25లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కూడా సుప్రీం ఆదేశాల‌తు జారీ చేసింది.

అంతేకాకుండా త‌దుప‌రి విచార‌ణ‌కు ఈసీ త‌రఫు ఉద్యోగి కూడా హాజ‌రుకావాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఈ వివాదాన్ని దేశవ్యాప్తం చేయ‌డంలో చంద్రబాబు స‌ఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. ఇప్ప‌టికే న‌కిలీ ఓట్ల పేరిట అస‌లు ఓట్ల తొల‌గింపున‌కు రంగం సిద్ధ‌మైపోయింద‌ని గ‌గ్గోలు పెడుతున్న చంద్రబాబు.. ఫార్మ్ 7 ద‌ర‌ఖాస్తుల‌పై త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. తాజాగా వీవీ ప్యాట్ల లెక్కింపున‌కు సంబంధించి సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసిన చంద్రబాబు దానిపై విచార‌ణ జ‌రిగేలా చేయ‌డంలోనూ స‌ఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై ఈసీ ఏం స‌మాధానం చెబుతుందో? దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.