Begin typing your search above and press return to search.

కొత్త కోణం; అగస్టా పాపంలో 'మీడియా'

By:  Tupaki Desk   |   3 Jan 2017 10:28 AM GMT
కొత్త కోణం; అగస్టా పాపంలో మీడియా
X
పలు మలుపులు తిరుగుతూ.. ఎప్పటికప్పుడు సంచలనాలకు కేంద్రంగా మారిన అగస్టా కుంభకోణానికి సంబంధించి తాజాగా సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఇప్పటివరకూ పలువురు ప్రముఖులకు అంటిన అగస్టా మకిలి తాజాగా వ్యవస్థలకు పాకటం గమనార్హం. నిజానికి అగస్టా కుంభకోణం బయటకు వచ్చినప్పుడు చాలామంది దీన్ని అసలు నమ్మలేదు. ఎందుకంటే.. యూపీఏ సర్కారులో నిజాయితీపరుడిగా పేరున్న ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్న వేళ.. ఇలాంటి కుంభకోణం జరగటం సాధ్యమేనా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు.

అయితే.. అది సాధ్యమేనన్న విషయం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి. ఎయిర్ బస్ విమానాలకు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకునేందుకు అనువైన విమానాలు అవసరమని చెప్పటమే కాదు.. అందుకు 19,685 అడుగుల ఎత్తులో ఎగరగల వీవీఐపీ విమానాల కోసమని చెప్పి.. దాన్నికాస్తా 15వేల అడుగుల సామర్థ్యానికి తగ్గించిన వైనం బయటకు వచ్చినప్పుడు అగస్టా కుంభకోణం జరిగిందన్న భావన పలువురిలో వ్యక్తమైంది. దాదాపు రూ.1200 కోట్ల మొత్తం ఈ కుంభకోణం వెనుక ఉందన్న విషయంపై పలు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణంలో తాజాగా మీడియాకు.. పలువురు జర్నలిస్టులకు భాగస్వామ్యం ఉన్నట్లుగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సముచితమైన కారణం లేకపోలేదు. ఈ స్కాంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. చాపర్ల కొనుగోలు ఒప్పందంపై పాజిటివ్ గా కథనాలు రాసిన పలు మీడియా సంస్థలు.. జర్నలిస్టులు.. ఈ స్కాం ద్వారా లబ్థి పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలపై దృష్టి సారించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో కొత్త కలకలం రేగినట్లైంది.

అగస్టా ఒప్పందాన్ని సమర్థిస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులకు.. మీడియా సంస్థలకు దాదాపు రూ.50కోట్ల మేర ముడుపులు అందాయని.. అలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై స్సందించిన సుప్రీం.. ఆరోపణలు ఉన్న వారిపై విచారణ జరపాలంటూ విచారణ సంస్థ సిట్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/