Begin typing your search above and press return to search.

అగ్ని ప్ర‌మాదం అలా జ‌రిగితే.. దేవుడు చేసిన‌ట్టే

By:  Tupaki Desk   |   9 Jan 2022 4:33 AM GMT
అగ్ని ప్ర‌మాదం అలా జ‌రిగితే.. దేవుడు చేసిన‌ట్టే
X
అన్ని అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణన‌లోకి తీసుకోలేమ‌ని సుప్రీంకోర్డు స్పష్టం చేసింది. అయితే.. తుఫాను, వరదలు, పిడుగుపాటు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. సంభవించిన అగ్నిప్రమాదాలను మాత్రం దేవుడు చేసిన అగ్నిప్ర‌మాదంగా ప‌రిగ‌ణిస్తామ‌ని.. సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి అగ్ని ప్ర‌మాదాన్నీ.. దేవుడు చేసిన‌ట్టుగా చూడ‌రాద‌ని.. ఇలాంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయ‌ని తెలిపింది.

2003లో ఓ వైన్ షాపులో జరిగిన అగ్నిప్రమాదాన్ని దేవుడు చేశాడని పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెల్లడించింది. అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యం కారణంగా జరగనందున దాన్ని మానవతప్పిందంగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. దీని వెనుక దేవుడు లేడ‌ని తెలిపింది. ఆయ‌న పేరును ప్ర‌స్తావించ‌రాద‌ని పేర్కొంది.

2003లో ఉత్తర్ప్రదేశ్లోని ఓవైన్ షాపుకి చెందిన గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత సంస్థ నష్టపరిహారం కింద రూ. 6.39 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. అగ్నిప్రమాదం నిర్లక్ష్యం కారణంగా జరిగినట్లు ఆధారాలు లేవని, ఇది దేవుడే చేసి ఉంటాడ‌ని పేర్కొంటూ తీర్పును ఇచ్చింది.

దీనిపై అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మానవ తప్పిదం కారణంగా జరిగిందని స్పష్టం చేసింది. "2003, ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12.55 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటన దేవుడి చర్యగా పరిగణించలేం. ఘటన జరిగిన సమయంలో తగిన చర్యలు చేపట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది కాదు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదు.`` అని సుప్రీం కోర్టు తెలిపింది.