Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయవద్దు: సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   2 May 2022 7:29 AM GMT
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయవద్దు: సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
X
ఆ మధ్య ఏపీలో ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేశారు. వేసుకోని వారిని దొరకబట్టి మరీ ఇంజెక్షన్ వేశారు. కొందరు ముసలివాళ్లు, భయస్తులు వేసుకోం అంటూ మారాం కూడా చేశారు. ఇవి వేసుకుంటే ప్రాణాలు పోతున్నాయని కొందరు మొండికేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికి బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన.. ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీంకోర్టు స్టేట్ మెంట్లో పేర్కొంది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనలపై చేపట్టిన విచారణలో ఈ విధంగా స్పష్టం చేసింది.

విస్తృత ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం రూపొందించిన పాలసీలో కొన్ని షరతులు విధించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. టీకాలు వేయని వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించడాన్ని నిరోధించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు విధించిన షరతులను ప్రస్తుత పరిస్థితుల కారణంగా రీకాల్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇలాంటి ఆంక్షలు సరికాదని పేర్కొంది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బహిరంగ పరచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశిస్తూ.. ప్రజలు, డాక్టర్లు వ్యాక్సిన్ వేసే క్రమంలో వారు చెప్పిన రిపోర్టులను ఏమాత్రం రాజీపడకుండా ప్రచురించాలని చెప్పింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే అంశంపై వేసిన పిటీషన్ ను ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పునిచ్చింది.

టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటీషనర్ డాక్టర్ జాకబ్ పులియేల్ తన పిటీషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపులో మాజీ సభ్యుడైన ఆయన.. కోవిడ్ వ్యాక్సినేషన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

ఈ క్రమంలోనే వ్యాక్సిన్లు తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తరుఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అదే సమయంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ వాదనలన్నీ విన్న తర్వాత కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయవద్దని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వారి ఇష్టానికి వదలేయాలని సూచించింది.