Begin typing your search above and press return to search.

కొలీజియంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   7 Jan 2023 5:30 AM GMT
కొలీజియంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య రేగిన వివాదం ఇంకా చల్లారడం లేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం వ్యవస్థ అనవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం లేదు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై మాటల యుద్ధం సాగుతోంది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను సైతం కేంద్రం వెనక్కి పంపడంపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా కొలీజియం సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ దాన్ని నిరోధించరని వెల్లడించింది. అయితే అప్పటివరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై తాజాగా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపిస్తోందని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెచ్చారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ విషయాన్ని గత ఉత్తర్వుల్లోనూ లేవనెత్తామని న్యాయమూర్తులు గుర్తు చేశారు. దీంతో పేర్లను ఆమోదించే ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలావధుల్లో పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కొలీజియం న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వానికి సొంత అభిప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ సూచించారు. అంతేగానీ కొలీజియం ప్రతిపాదనలను పెండింగులో ఉంచడం సరికాదని తెలిపారు. కొలీజియం సూచించిన పేర్లపై అభిప్రాయాలను తెలుపుతూ పేర్ల జాబితాను వెనక్కి పంపితే పరిశీలిస్తామన్నారు. ఆ పేరును తిరిగి సిఫార్సు చేయాలా, తప్పించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఆ పేరును కొలీజియం పునరుద్ఘాటించిందంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియామకాన్ని ఏదీ ఆపలేదు అని జస్టిస్‌ కౌల్‌ స్పష్టం చేశారు.

కొలీజియం సిఫార్సుల ఆమోదంలో విపరీతమైన జాప్యం కారణంగా ప్రతిభావంతులైన జడ్జీలు న్యాయవ్యవస్థకు దూరం అవుతున్నారని జస్టిస్‌ కౌల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగులో ఉంచుకోవడం.. పునరుద్ఘాటించిన పేర్లను వెనక్కి పంపడం ఆరోగ్యకరమైన వాతావరణం కాదన్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్ల పరిస్థితేంటని అటార్నీ జనరల్‌ ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కొంత గడువు కావాలని వెంకట రమణి అభ్యర్థించారు. అలాగే పది మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులను పెండింగ్‌లో పెట్టడంపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.