Begin typing your search above and press return to search.

దీపావళి పండుగపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:21 AM GMT
దీపావళి పండుగపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
X
వెలుగుల పండుగ దీపావళిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలు కల్పించాలని తేల్చిచెప్పింది. అలాగే బాణసంచా కోసం చేసే ఖర్చును మిఠాయిలు కొనుక్కోవడానికి వినియోగించాలని ఢిల్లీ ప్రజలకు సూచించింది.

దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తాజాగా తోసిపుచ్చింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

ఢిల్లీ నగరంలో కాలుష్య నివారణ ప్రయత్నాల్లో భాగంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అత్యవసర విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ కోర్టుకు విన్నవించారు. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

మరోవైపు టపాసుల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనే కాకుండా ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. ఇలా చివరి నిమిషంలో బాణసంచాపై నిషేధం విధించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం వల్ల కొందరి జీవనోపాధి దెబ్బతింటుందని వివరించారు. ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిటిషనర్‌ వాదించారు. ఈ పిటిషను అయితే ఇదే అంశంపై పలు పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నాయని.. అందువల్ల తాము విచారించలేమని న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ తోసిపుచ్చారు.

మరోవైపు దీపావళి సందర్భంగా పర్యావరణ హితమైన బాణసంచా అమ్మకాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ పాలిత హరియాణాలోనూ పర్యావరణ హిత బాణసంచాను మాత్రమే అనుమతించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.