Begin typing your search above and press return to search.

మైనింగ్ కింగ్ కు ఊహించ‌ని షాకిచ్చిన సుప్రీంకోర్టు!

By:  Tupaki Desk   |   10 Oct 2022 10:30 AM GMT
మైనింగ్ కింగ్ కు ఊహించ‌ని షాకిచ్చిన సుప్రీంకోర్టు!
X
క‌ర్ణాట‌క మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత‌ గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయ‌న బెయిల్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల ఆయ‌న త‌న బెయిల్లో మార్పులు చేయాలంటూ పెట్టుకున్న పిటిష‌న్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పును వెలువ‌రింది.

క‌ర్ణాట‌క‌- ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో ఓబుళాపురంలో అక్ర‌మంగా, నిర్దేశిత ప‌రిమితికి మించి ఇనుప ఖ‌నిజం తవ్వార‌ని గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కంపెనీ అయిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసులో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి గ‌తంలో అరెస్టు అయ్యారు. కొంత‌కాలం జైలులో ఉన్నారు. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు బెయిల్ పొందారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు గాలిని ఆయ‌న సొంత ప్రాంతం బ‌ళ్లారి వెళ్ల‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ప‌లు ఆంక్ష‌లు, ష‌ర‌తులు సైతం విధించింది.

దీంతో త‌న బెయిల్‌లో మార్పులు చేయాలంటూ ఆయన కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త‌న బెయిల్‌ను రద్దు చేయాలని విన్నవించారు. బళ్లారికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంత‌కుముందే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా త‌న తీర్పును వెలువ‌రించింది.

సుప్రీంకోర్టులో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి త‌ర‌ఫున‌ సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాద‌న‌లు వినిపించారు. బెయిల్ నిబంధన సడలించాలని లేదా దాన్ని కొట్టివేయాలని కోర్టుకు నివేదించారు. అలాగే బళ్లారి వెళ్లడానికి గాలికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తన కుమార్తెను చూడటానికి తన స్వస్థలమైన బళ్లారికి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి వెళ్లాల్సి ఉందని, దీనికి అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేయాలంటూ గాలి జనార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేసింది. నెల రోజుల పాటు మాత్రమే బళ్లారిలో ఉండ‌టానికి అనుమతి ఇచ్చింది. అక్ర‌మ మైనింగ్‌తో సంబంధం ఉన్న‌వారెవ‌రినీ గాలి క‌లుసుకోకూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సమయంలో అక్రమ మైనింగ్ కేసులో ట్రయల్స్ మొదలు పెట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని, ఆరు నెలల్లోగా పూర్తి చేయాల‌ని ఆదేశాలు వెలువ‌రించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.