Begin typing your search above and press return to search.

కోర్టు మాటతో శ్రీరాముడి వారసుల్ని వెతకనున్నారా?

By:  Tupaki Desk   |   10 Aug 2019 4:55 AM GMT
కోర్టు మాటతో శ్రీరాముడి వారసుల్ని వెతకనున్నారా?
X
సుదీర్ఘకాలంగా నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. ఈ వివాదానికి చెక్ చెప్పటంతో పాటు.. దీన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక లెక్కకు రాని పరిస్థితి. అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి సంబంధించి ఇరు వర్గాల మద్య నడుస్తున్న వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. కుదరటం లేదు. చివరకు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వర్గాలకు చెందిన పెద్ద మనుషుల్ని జట్టు చేసి.. రాజీ ప్రతిపాదన చేయాలని చెప్పినా.. అది కూడా కుదర్లేదు.

ఇలాంటి వేళ.. ఈ అంశాన్ని తామే చూస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను మరింత వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా నిర్వహించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నోటి నుంచి వచ్చిన మాట ఒకటి ఆసక్తికరంగా మారింది. రఘు వంశానికి చెందిన వారు ఎవరైనా అయోధ్యలో ఉన్నారా? అని తాజాగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రామ్ లల్లా విరాజ్ మాన్ సంస్థ తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాదిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీరాముని వారసులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని తమకు ఆసక్తిగా ఉందని పేర్కొనటం గమనార్హం.

అయోధ్యలోని వివాదాస్పద కట్టటంపై రోజువారీగా విచారణ జరుగుతున్న వేళ.. శుక్రవారం జరిగిన విచారణలో సుప్రీంధర్మాసనం వేసిన ప్రశ్న ఆసక్తికరంగానే కాదు.. చర్చనీయాంశంగా మారింది. ధర్మాసనం మాటకు స్పందించిన న్యాయవాది పరాశరణ్.. ఈ విషయంపై తనకు సమాచారం లేదని.. తెలుసుకొని విన్నవిస్తానని సమాధానమిచ్చారు. ధర్మాసనం పుణ్యమా అని రానున్న రోజుల్లో తామే రఘువంశ వారసులమని తెర మీదకు వస్తే.. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?