Begin typing your search above and press return to search.

అమేజాన్, ఫ్లిప్ కార్డ్ లకు సుప్రీంకోర్టు షాక్

By:  Tupaki Desk   |   9 Aug 2021 1:34 PM GMT
అమేజాన్, ఫ్లిప్ కార్డ్ లకు సుప్రీంకోర్టు షాక్
X
ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలపై సీబీఐ జరుపుతున్న విచారణను నిలిపివేసేందుకు నిరాకరించింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కేటాయించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని భారత్ లోని వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిగణలోకి తీసుకుంది. గత ఏడాది జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది.

అయితే ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. ఈకామర్స్ సంస్థల పిటీషన్లకు విచారణ అర్హత లేదంటూ జులై 23న కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపారవిధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీసీఐ విచారణను నిలిపివేయాలన్న సంస్థల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి పెద్ద సంస్థలు దర్యాప్తు, పారదర్శకత వంటి అంశాల్లో స్వచ్ఛందంగా వ్యవహరించాలి. ఇలాంటి విచారణలకు ముందుకు రావాలి.. అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వాటికిషాకిచ్చేలా తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లోగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.