Begin typing your search above and press return to search.

ఎల్జీకి షాక్.. ఎన్జీటీ ఆదేశాలపై స్టేకు సుప్రీం నో

By:  Tupaki Desk   |   19 May 2020 3:00 PM GMT
ఎల్జీకి షాక్.. ఎన్జీటీ ఆదేశాలపై స్టేకు సుప్రీం నో
X
విశాఖలో పెను ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. 12 మంది మృతి, 500 మందికి పైగా ఆస్పత్రి పాలైన దుర్ఘటనను సుమోటోగా స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) విచారణను చేపట్టింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు... రూ.50 కోట్లను డిపాజిట్ చేయాలంటూ ఎల్జీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు విషయాలపై తనదైన వాదనను వినిపించేందుకు సిద్ధమైన ఎల్జీ పాలిమర్స్... సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీతో పాటు ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎల్జీ పిటిషన్ ను కొట్టేసింది.

ఈ సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదంపై ఎన్జీటీ విచారణ, రూ.50 కోట్లను డిపాజిట్ చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ఆయా కోర్టుల్లోనే తన వాదనలు వినిపించుకోవాలని ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రమాదంపై విచారణ చేపట్టడానికి ఎన్జీటీకి అర్హత లేదని ఎల్జీ పాలిమర్స్ వాదించింది. అంతేకాకుండా విచారణతో ఎలాంటి సంబంధం లేకుండా రూ.50 కోట్లను డిపాజిట్ చేయాలని చెప్పే అధికారం ఏపీ హైకోర్టుకు కూడా లేదని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే ఈ రెండు వాదనలను విన్న సుప్రీంకోర్టు... ఎల్జీ వాదనలను తిరస్కరించింది. అంతేకాకుండా అటు ఎన్జీటీ, ఇటు హైకోర్టుల్లో ఈ విషయంపై విచారణ పూర్తి అయ్యేదాకా తాము ఎలాంటి విచారణ చేపట్టలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.

తమ ముందు వినిపించడానికి సిద్ధం చేసుకున్న వాదనలను ఎన్జీటీతో పాటు ఏపీ హైకోర్టులో విన్నవించుకోవాలని కూడా ఎల్జీ పాలిమర్స్ న్యాయవాదులకు సుప్రీంకోర్టు సూచించింది. ఎన్జీటీతో పాటు ఏపీ హైకోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ రెండు కోర్టులో విచారణ ముగించేదాకా ఎల్జీ పిటిషన్లపై తాము విచారణ చేపట్టలేమని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా ప్రమాదానికి సంబంధించిన ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా కూడా ఆ రెండు కోర్టుల విచారణలోనే చెప్పుకోవాలని ఎల్జీ పాలిమర్స్ కు సూచించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వచ్చే నెల (జూన్) 8వ తేదీకి వాయిదా వేసింది.