Begin typing your search above and press return to search.

త‌లాఖ్ పై సుప్రీం ఏం చెప్పిందంటే...

By:  Tupaki Desk   |   29 Jun 2016 1:45 PM GMT
త‌లాఖ్ పై సుప్రీం ఏం చెప్పిందంటే...
X
మూడు సార్లు తలాఖ్ అని చెప్ప‌డం ద్వారా విడాకులు తీసుకునే విధానంపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం సమాజంలోని ట్రిపుల్ తలాఖ్ విధానం చాలా కీలకమైన అంశమని..ఇది పెద్ద సంఖ్యలో ప్రజలపై ప్రభావం చూపించే అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మూడు సార్లు తలాఖ్ చెప్పి విడాకులిచ్చే పద్దతి (ట్రిపుల్ తలాఖ్)ని పర్సనల్ లా ద్వారా పర్యవేక్షించేందుకు సిద్దంగా ఉన్నామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాజ‌స్తాన్‌లోని జైపూర్‌ కు అఫ్రీన్‌ రెహ్మాన్‌ (25) కు చెందిన కేసుతో పాటు మరికొందరు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అఫ్రీన్ వాదన ప్రకారం 'మాట్రిమోనీ పోర్టల్‌ ద్వారా వివాహం కుదుర్చుకుని 2014లో వివాహం చేసుకున్నాను. వివాహం అయిన రెండు మూడు నెలలకే వరకట్నం డిమాండ్‌ చేస్తూ మా అత్తమామలు నన్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొట్టడం ప్రారంభించారు. అదే ఏడాది సెప్టెంబరులో ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పుడు నేను మా పుట్టింటికి వచ్చేశాను. అయితే షాకింగ్‌ గా స్పీడ్‌ పోస్టులో మా ఇంటికి విడాకులు (తలాక్ అని మూడు సార్లు రాసి ఉన్న ప‌త్రం) పంపించారు' అని ఆమె వాపోయారు. 'ఇది పూర్తిగా అన్యాయం, ఆమోదయోగ్యం కానిది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను' అని వివరించారు. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం ట్రిపుల్ తలాఖ్ అంశంపై రెండు వర్గాల నుంచి బలమైన కారణాలు ఉన్నాయని...ఈ విధానంపై ఎలాంటి స్పష్టతకు రాలేదని పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్ విధానం వల్ల గతంలో ఏమైనా తప్పిదాలు జరిగాయా అంశంపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.

ఇదిలాఉండగా ముస్లిం స‌మాజంలో నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నాయి. ఈ విధంగా తలాఖ్ ప‌దంతో విడాకులు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకంగా ఇటీవల 50 వేల మంది ముస్లింలు సంతకాలు చేశారు. మ‌హిళల ఆత్మ‌గౌర‌వానికి - ఆవేద‌న‌కు ఏ మాత్రం విలువ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని వారు వాపోతున్నారు. 'భారతీయ ముస్లిం మహిళ ఆందోళన సంస్థ' తలాఖ్ పద్ధతికి వ్యతిరేకంగా వీరంద‌రినీ జ‌త‌చేసి పోరాడుతోంది. తాజాగా ఈ సంస్థ త‌లాక్‌ పద్ధతి ఖురాన్ కు వ్యతిరేకమని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. ముస్లిం మ‌హిళ‌ల‌ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆయా వ‌ర్గాల‌కు చెందిన పెద్ద‌ల‌పై ఈ సంస్థ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అఖిల భారత ముస్లిం మహిళ పర్సనల్ లాబోర్డ్ అధ్యక్షురాలు షయిషా అంబర్ త‌లాక్‌ పై ఇటీవ‌ల స్పందిస్తూ త‌లాక్ పేరుతో విడాకులు ఇవ్వ‌డం ఇస్లాం వ్యతిరేకమని అన్నారు. ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం అని పేర్కొన్న ష‌యిషా దానిని రద్దు చేయడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు.