Begin typing your search above and press return to search.

ఆ బాల నేరస్తుడిని విడుదల చేస్తారా? చేయరా?

By:  Tupaki Desk   |   20 Dec 2015 10:12 AM GMT
ఆ బాల నేరస్తుడిని విడుదల చేస్తారా? చేయరా?
X
నిర్భయ వ్యవహారంలో అత్యంత క్రూరంగా వ్యవహరించిన బాల నేరస్తుడు ఆదివారం విడుదల అవుతాడా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నేరం జరిగే నాటికి మైనర్ కావటంతో (మేజర్ కావటానికి కేవలం 3 నెలల తక్కువ మాత్రమే) అతడిని బాల నేరస్తుడిగా గుర్తించి శిక్ష వేయటం తెలిసిందే. అతడికి కోర్టు విధించిన శిక్ష పూర్తి కావటంతో ఆదివారం విడుదల కావాల్సి ఉంది. అయితే.. అతడి విడుదలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నిర్భయ తల్లిదండ్రులు మొదలుకొని.. పలు మహిళా సంఘాలు సైతం.. ఈ బాల నేరస్తుడి విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇతగాడిని విడుదల చేయకూడదంటూ.. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారి వాదనల్ని కొట్టేసి.. శిక్షా కాలం ముగిసిన తర్వాత జైల్లో ఉంచటం సరికాదని చెప్పటం తెలిసిందే.

మరోవైపు.. బాల నేరస్తుడి విడుదలను ఆపాలంటూ శనివారం అర్థరాత్రి ఢిల్లీ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుచేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని విచారణ చేపట్టాలంటూ ప్రధాన న్యాయమూర్తిని ఢిల్లీ మహిళా కమిషన్ కోరింది. అయితే.. అర్థరాత్రి వేళ విచారించాల్సినంత అత్యవసర పిటీషన్ కాదని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసి.. సోమవారం విచారణకు ఓకే చేసింది.

బాల నేరస్తుడి వ్యవహారంపై సుప్రీంలో విచారణ సోమవారానికి రానున్న నేపథ్యంలో.. అతడి విడుదల ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనిపై జైలు అధికారులు పెదవి విప్పటం లేదు. ఇప్పటికే బాల నేరస్తుడ్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన వారు.. అతడిని విడుదల చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.