Begin typing your search above and press return to search.

'అయోధ్య' కేసులో కీల‌క ప‌రిణామం!

By:  Tupaki Desk   |   27 Sep 2018 2:51 PM GMT
అయోధ్య కేసులో కీల‌క ప‌రిణామం!
X
2019 ఎన్నిక‌లకు ముందు సుప్రీం కోర్టు ఓ కీల‌కమైన తీర్పును వెలువ‌రించింది. ఎన్నో ఏళ్లుగా న‌లుగుతోన్న అయోధ్య భూ యాజమాన్య హక్కుల కేసుకు సంబంధించిన ఓ కేసులో కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది. అత్యంత సున్నిత‌మైన ఈ కేసుకు సంబంధించిన మ‌రో కేసును విస్తృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. మసీదులో నమాజ్ చేయడమనేది ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. 1994నాటి తీర్పును పునఃసమీక్ష నిమిత్తం విస్తృత ధర్మాసనానికి బ‌దిలీ చేయాల‌ని కోరుతూ దాఖలైన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా - జస్టిస్ అశోక్ భూషణ్ - జస్టిస్ అబ్దుల్ నజీర్ ధర్మాసనం 2:1 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. 1994 నాటి కేసు తీర్పును ఐదుగురు సభ్యులు విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయంతో సీజేఐ దీపక్‌ మిశ్రా - జస్టిస్‌ భూషణ్‌ విభేదించారు. ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందనీ - అన్ని మతాలు సమానమేనని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పేర్కొంది. తాజాగా నేడు వెలువ‌డిన తీర్పుతో అయోధ్య రామ‌మందిరం-బాబ్రీ మ‌సీదు కేసు విచారణ వ‌చ్చే నెల 29 నుంచి ప్రారంభం కానుందని సుప్రీం తెలిపింది.

1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో మసీదులో ప్రార్థనలు చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తీర్పు వెలువ‌డింది. ఆ కేసును విస్తృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేసి పునఃస‌మీక్ష జ‌ర‌పాలంటూ కొంద‌రు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్ల‌ను సుప్రీం నేడు కొట్టి వేసింది. భూసేకరణ వ్యవహారాల దృష్ట్యా ఆ తీర్పును అర్థం చేసుకోవాలని - తప్పనిసరి భూ సేకరణ నుంచి మత సంబంధ స్థలాలకు మిన‌హాయింపు లేద‌ని తెలిపింది. కాగా, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వచ్చే నెల 2న పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో, కొత్త‌గా రాబోయే ప్ర‌ధాన న్యాయమూర్తి తో ఏర్పాటు కాబోయే నూతన త్రిసభ్య ధర్మాసనం రామజన్మభూమి వివాదం సివిల్ దావాపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. వచ్చే నెల 29న ఈ కేసుకు సంబంధించిన‌ తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని రామ్‌ లల్లా - నిర్మోహి అఖాడా - సున్నీ వక్ఫ్‌ బోర్డుల‌కు 3 భాగాలుగా పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును హిందూ - ముస్లిం సంస్థలు స‌వాలు చేశాయి. ఆ కేసుకు సంబంధించి 1994లో ఇచ్చిన కేసు తీర్పును ముస్లిం సంస్థ‌లు ...విస్తృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేయాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. దీంతో, అయోధ్య రామజన్మభూమి భూ యాజ‌మాన్య హక్కుల కేసు విచార‌ణ‌కు 1994 కేసు పై వేసిన పిటిష‌న్ అడ్డంకిగా మారింది. తాజా తీర్పుతో ఆ అడ్డంకి తొల‌గిన‌ట్ల‌యింది. దీంతో, అయోధ్య రామజన్మభూమి భూ యాజ‌మాన్య హక్కుల కేసు విచార‌ణ వేగ‌వంతం అయ్యేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే నెల 29న అస‌లు కేసైన అయోధ్య రామ‌మందిరం-బాబ్రీ మ‌సీదు కేసు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.