Begin typing your search above and press return to search.

ల‌వ్‌ జిహాద్‌...సుప్రీంకోర్టులో అనూహ్య ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   29 Aug 2018 5:49 AM GMT
ల‌వ్‌ జిహాద్‌...సుప్రీంకోర్టులో అనూహ్య ట్విస్ట్‌
X
ముస్లిం యువ‌కుల హిందూ మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకునేందుకు ప్రేమ పేరుతో వ‌ల‌వేస్తున్నార‌ని, `ల‌వ్ జిహాద్‌`గా పిల‌వ‌బ‌డే ఈ కుట్ర‌లో బ‌లి అవ‌ద్దంటూ హిందుత్వ వాదుల సూచ‌న‌లు - త‌మ నిజ‌మైన ప్రేమ‌కు మ‌తం రంగు పుల‌మ‌వ‌ద్దంటూ ముస్లిం యువ‌త వాదోప‌వాదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గానే..ఇటీవ‌లే ఓ ఉదంతం దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ల‌వ్‌జిహాద్‌, ప్రేమ పెళ్లి ఉదంతంలో మతాన్నే మార్చుకొని వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడికి ఎదురుదెబ్బ తగిలింది. భర్త చెంతకు వెళ్లేందుకు భార్య నిరాకరించింది. తల్లిదండ్రుల వద్దే ఉంటానని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట స్పష్టంచేసింది. దీంతో ఈ ప్రేమ కథ అడ్డం తిరిగింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రంలోని రాయ్‌ పూర్‌ కు చెందిన 23 ఏళ్ల‌ హిందూ యువతిని వివాహం చేసుకునేందుకు 33 ఏళ్ల‌ ఓ ముస్లిం యువకుడు హిందూమతాన్ని స్వీకరించాడు. ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకుని ఆమెకు తాళిక‌ట్టాడు. అయితే, అనంత‌రం అత‌డి అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టికే ఆయ‌న‌కు రెండు పెళ్లిల్లు అయ్యాయి. ఆ అమ్మాయిపై వ‌ల‌ వేసి పెళ్లి చేసుకున్నాడ‌ని తేలింది. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ‌కు న‌చ్చ‌చెప్పి భ‌ర్త‌కు దూరంగా ఉంచాయి. అయితే, యువతి తల్లిదండ్రులు - హిందూ సంఘాలు తమను బలవంతంగా విడదీశాయని ఆరోపిస్తూ యువకుడు.. ఈ నెల 17న సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ధ‌ర్మాస‌నం వాద‌న‌లు స్వీక‌రించింది. యువతి మేజర్ అయినందున నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఆమెకు ఉన్నదని, తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని యువతి చెప్పిందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ ఆమె తన భర్త వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోతే అది వివాహసంబంధమైన కేసు అవుతుందని, దీనిపై సంబంధిత కోర్టు తీర్పు ఇస్తుందని వ్యాఖ్యానించింది. రెండుసార్లు వివాహమై విడాకులు తీసుకున్న విషయాన్ని దాచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఛత్తీస్‌గఢ్ ఏజీ జుగల్ కిశోర్ గిల్డా న్యాయస్థానానికి వివరించారు. ఇరుప‌క్షాల వాద‌న‌ల అనంత‌రం న్యాయ‌మూర్తి ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కోర‌గా..త‌ను ముస్లిం యువ‌కుడి చేతిలో మోస‌పోయాన‌ని పేర్కొంటూ త‌ల్లిదండ్ర‌ల‌తోనే క‌లిసి ఉంటాన‌ని వెల్ల‌డించింది. దీంతో న్యాయ‌స్థానం అందుకే స‌మ్మ‌తించింది.