Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ మీద సుప్రీం చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   22 Aug 2017 8:33 AM GMT
ట్రిపుల్ త‌లాక్ మీద సుప్రీం చెప్పిందేమిటి?
X
కొన్నేళ్లుగా వివాదాస్ప‌దంగా మారిన ట్రిపుల్ త‌లాక్ మీద సుప్రీం కోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది. ట్రిపుల్ త‌లాక్ మీద సుప్రీం చెప్పిన తీర్పు ఎందుకు సంచ‌ల‌నం? అంటే.. అది ప్ర‌స్తావించిన అంశాల‌తో పాటు.. ఆచితూచి అన్న‌ట్లుగా ఇచ్చిన ఆదేశాలే దీనికి కార‌ణంగా చెప్పాలి. మ‌రింత ఆస‌క్తిక‌ర అంశం ఏమిటంటే.. ట్రిపుల్ త‌లాక్ కు సంబంధించిన త‌న తీర్పుతో పాటు.. కేంద్ర ప్ర‌భుత్వం కూడా నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. ఇందుకు ఆర్నెల్ల స‌మ‌యం ఇవ్వ‌టం విశేషం.

మూడుసార్లు త‌లాక్ అన్న మాట‌తో ముస్లిం మ‌హిళ‌ల‌కు భ‌ర్త‌లు విడాకులు ఇస్తున్న వైనంపై ఎప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ లేకుండా.. వారి అభిప్రాయంతో సంబంధం లేకుండా.. మూడు మాట‌ల‌తో వారి జీవితాల్ని మార్చేసే ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు ముస్లిం మ‌హిళ‌లు పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కొద్దికాలంగా విచార‌ణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో కూడిన ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన బృందం తాజాగా తీర్పును వెల్ల‌డించింది.

తీర్పులోని కీల‌క అంశాలు చూస్తే..

+ భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్స్ 14.. 21ల‌ను ట్రిపుల్ త‌లాక్ ఉల్లంఘించ‌టం లేదు. ఈ విష‌యంలో మేం జోక్యం చేసుకోలేం.

+ ట్రిపుల్‌త‌లాక్ మీద ఆర్నెల్ల లోపు పార్ల‌మెంటులో చ‌ట్టం తీసుకురావాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ఉంది.

+ ఈ ఆర్నెల్ల కాలంలో ట్రిపుల్ త‌లాక్ చెల్ల‌దు.

+ ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో కానీ ట్రిపుల్ త‌లాక్ మీద కేంద్రం చ‌ట్టం తీసుకురాలేని ప‌క్షంలో.. ప్ర‌స్తుతం మేం విధించిన నిషేధం ఆర్నెల్ల త‌ర్వాత అమ‌ల్లో ఉండ‌దు.

+ ఇప్పుడు చేప‌ట్టిన విచార‌ణ‌ను ఆర్నెల్ల వ‌ర‌కూ రిజ‌ర్వ్ పెట్ట‌టం జ‌రుగుతుంది

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జేఎస్ ఖేహార్‌.. మ‌రో న్యాయ‌మూర్తి ఎస్ అబ్దుల్ న‌జీర్ లు ట్రిపుల్ త‌లాక్‌ను స‌మ‌ర్థించారు. అయితే.. ధ‌ర్మాస‌నంలోని మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తులు (జ‌స్టిస్ నారీమ‌న్‌.. జ‌స్టిస్ యూయూ ల‌లిత్.. జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌)లు మాత్రం ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగ విరుద్దంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇస్లాంలో భాగ‌మైన సున్నీ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు గ‌డిచిన వెయ్యేళ్లుగా ట్రిపుల్ త‌లాక్‌ ను పాటిస్తున్న‌ట్లుగా జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్ వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా ట్రిపుల్ త‌లాక్ మీద చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన నిర్ణ‌యాన్ని తీసుకునేలా కేంద్రంపై సుప్రీం బాధ్య‌త పెట్టింద‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.