Begin typing your search above and press return to search.

‘కావేరీ’పై సుప్రీం సీరియస్

By:  Tupaki Desk   |   16 Sep 2016 4:23 AM GMT
‘కావేరీ’పై సుప్రీం సీరియస్
X
కావేరీ నదీజలాల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కావేరీ జలాల వినియోగంపై తామిచ్చిన తీర్పు నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తీర్పు నేపథ్యంలో చెలరేగిన హింసను కట్టడి చేయటంలో కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాలు విఫలమయ్యాయంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాత్మక ఆందోళనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. తీర్పుపై అభ్యంతరాలు ఉంటే న్యాయ పరిష్కార మార్గాల్ని ఆశ్రయించాల్సిందిగా సూచన చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో చెలరేగిన హింసపై తమిళనాడుకు చెందిన శివకుమార్ వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకోలేరని స్పష్టం చేసిన సుప్రీం.. హింస.. ఆందోళనలు.. విధ్వంసం.. ఆస్తినష్టం జరగకుండా రెండు రాష్ట్రాలు చూడాలని చెప్పింది.

కోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసినప్పుడు.. బంద్ లు కానీ ఆందోళనలుకానీ జరగటానికి వీల్లేదని పునరుద్ఘాటిస్తున్నామని.. ఒకవేళ తీర్పుతో ఏదైనా ఇబ్బంది ఉంటే.. సంబంధీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కానీ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలతో పరిస్థితి చక్కబడినట్లుగా కనిపిస్తుందన్న సుప్రీం.. తాజా పరిస్థితిపై పిటీషనర్ ను ప్రశ్నించింది. శుక్రవారం కూడా కర్ణాటకలో రైలు రోకోను నిర్వహిస్తున్నారని.. ఆ రాష్ట్రంలో బస్సులు తిరగటం లేదని.. తమిళనాడులో కూడా బంద్ కు పిలుపునిచ్చిన విషయాన్ని సుప్రీం దృష్టికి పిటీషనర్ తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లకుండా చూడాల్సిన పవిత్ర బాధ్యత రెండు రాష్ట్రాల మీద ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు.. హింసాత్మక ఆందోళనల్ని ఎదుర్కోవాల్సిన తీరుపై 2009లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. హింస.. ఆందోళనలు.. విధ్వంసం.. ఆస్తినష్టం జరగకుండా చూడటం రెండు రాష్ట్రాల బాధ్యతగా తాము చెప్పక తప్పటం లేదన్న జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ యు.యు. లలిత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేరోజున కావేరీ నదీ జలాల వివాదాన్నికూడా విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. తాజా సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఆందోళనలకు ఏ మేరకు చెక్ చెబుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.