Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టులో సందడేసందడి

By:  Tupaki Desk   |   13 July 2016 6:35 AM GMT
సుప్రీంకోర్టులో సందడేసందడి
X
సుప్రీంకోర్టు అంటే దేశానికే అత్యున్నత న్యాయస్థానం. ఒకరకమైన గంభీరమైన వాతావరణం.. క్రమశిక్షణ అన్నీ అక్కడ కనిపిస్తాయి. అదే... బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ సుల్తాన్ ఆడుతున్న సినిమా హాలయితే ఎలా ఉంటుంది. కిక్కిరిసిన జనాలతో ఈలలు - చప్పట్లతో గందరగోళంగా ఉంటుంది. మంగళవారం సుప్రీంకోర్టు కూడా అంతే గందరగోళంగా ఉందట. అందుకు కారణం.. ఎప్పుడూ లేనంతగా ఏకంగా 1330 కేసులు విచారణకు రావడమే.

సుప్రీంకోర్టులో ఒకేసారి 1330 కేసులు విచారణకు రావడంతో మంగళవారం కిక్కిరిసిపోయింది. 6వ తేదీన రంజాన్ పండుగ కావడంతో కేసులు లిస్టు చేయలేదు.. కానీ.. పండుగ 7న వచ్చింది. దీంతో 7న లిస్టు చేసిన కేసుల్లోనూ చాలావరకు విచారణకు రాలేదు... ఆ తరువాత ఒకట్రెండు రోజులు సెలవులు.. ఇలా చివరికి మంగళవారం ఏకంగా 1330 కేసులు విచారణకు వచ్చాయి. మామూలుగా రోజుకు 700 నుంచి 800 కేసులు విచారణకు వస్తాయి. కానీ.. మంగళవారం 15 బెంచీల వద్దకు 1080 కేసులొచ్చాయి. ఇవి కాకుండా రిజిస్ట్రార్ వద్ద 250 కేసులు లిస్టయ్యాయి. కోర్టు నంబరు 4లో ఏకంగా 86 కేసులు రావడంతో అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. కక్షిదారులు - లాయర్లతో మొత్తం నిండిపోయింది. లాయర్లు అటూఇటూ వెళ్లడానికి కూడా వెళ్లడానికి వీల్లేనట్లుగా మారిపోయింది.

సుప్రీంకోర్టులో ఎక్కడా అడుగేయడానికి ఖాళీ లేకపోయింది. ఏ కోర్టు దగ్గర చూసినా తోపులాటలు.. వాదనలతో రైలులో జనరల్ బోగీలా కనిపించింది. దీంతో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ ధవే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇకపై కేసులను రెండు సెషన్లుగా లిస్టు చేయాలని.. దానివల్ల ఎప్పుడు విచారణకు వస్తుందో ఆ సమయానికే వస్తారని.. రద్దీ తగ్గుతుందని సూచించారు.