Begin typing your search above and press return to search.

అర్నాబ్ గోస్వామి పై నమోదైన అన్ని కేసులపై స్టే ఇచ్చిన సుప్రీం!

By:  Tupaki Desk   |   24 April 2020 10:50 AM GMT
అర్నాబ్ గోస్వామి పై నమోదైన అన్ని కేసులపై స్టే  ఇచ్చిన సుప్రీం!
X
ఆర్నాబ్‌ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ పలు రాష్ట్రాలలో దాఖలైన కేసుల్లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మూడు వారాల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది.

తనపై దాఖలైన ఎఫ్ ఐ ఆర్‌ ల ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి పెట్టుకున్న పిటిషన్ మేరకు సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, -జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఆర్నాబ్‌ గోస్వామి పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేపట్టింది. ఆర్నాబ్‌ తరఫున సీనియర్ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

గోస్వామిపై దాఖలైన అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌ పూర్ ‌లో దాఖలైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. ప్రస్తుతం ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు. అలాగే ,ఆర్నాబ్ గోస్వామి - రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టు ముంబై పోలీస్ కమిషనర్‌ కి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్గఢ్‌ లో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీలో చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎఫ్ ఐ ఆర్‌ లు దాఖలైన సంగతి తెలిసిందే.