Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుకు సుప్రీం డెడ్ లైన్.. వారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలి

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:03 AM GMT
కేసీఆర్ సర్కారుకు సుప్రీం డెడ్ లైన్.. వారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలి
X
విడిపోయిన ఏడున్నరేళ్లు అవుతున్నా.. ఇప్పటికి విభజనకు సంబంధించి లొల్లి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయితీ ఒక పక్క.. నీటి లొల్లి ఇంకోపక్క.. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు అంశాలు నేటికి పరిష్కారం కాని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగు అకాడమీకి విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బుల్ని వారం వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశం జగన్ సర్కారుకు ఉపశమనంగా మారింది.

ఏపీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ విక్రమ్ నాథ్.. జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. అంతేకాదు.. నిధుల బదిలీకి కేవలం వారం మాత్రమే గడువు ఇవ్వటంతో కేసీఆర్ సర్కారుకు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.

విభజన లెక్కల్లో భాగంగా ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటివరకు బదిలీ చేయలేదనంటూ ఏపీ సర్కారు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళింది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ వాదన ఏమిటని ప్రశ్నించింది. దీనికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తనకు రెండు వారాల సమయం ఇవ్వాలని.. మరికొన్ని డాక్యుమెంట్లను కూడా తాము అందజేస్తామని పేర్కొంది. దీనికి స్పందించిన ధర్మాసనం.. రెండు వారాలు కాదు.. వారంలో డబ్బుల్ని బదిలీ చేయాలని.. అనంతరం స్థిరాస్తుల వాటాల విషయాన్ని చూద్దామని స్పష్టం చేసింది.

దీంతో సుప్రీం ఆదేశాలకు తగ్గట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల్ని బదిలీ చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సుప్రీం ఆదేశాల్ని యథాతధంగా అమలు చేస్తుందా? లేదంటే మరేదైనా కొర్రీ పెడుతుందా? అన్నది సందేహంగా మారింది. చరాస్తుల విషయంలోనే ఏపీ సర్కారుకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్ సర్కారు.. స్థిరాస్తుల విషయంలో ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయినా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న స్వప్నం సాకారం అయిన తర్వాత.. విభజన లెక్కల్ని సింఫుల్ గా తేల్చేసుకోవాల్సింది పోయి.. ఇలా సాగదీయటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.